యువత ఆశలపై నీళ్లుచల్లిన సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
యువత ఆశలపై నీళ్లుచల్లిన సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దేశంలో సాంకేతిక నైపుణ్య దార్శనికుడు రాజీవ్ గాంధీ

దిశ, జగిత్యాల ప్రతినిధి : స్వరాష్ట్రం సిద్ధిస్తే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించిన యువత ఆశలపై సీఎం కేసీఆర్ నీళ్లుచల్లారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఇందిరా భవన్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం బైపాస్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ కట్టిన జెండాలను రాత్రికి రాత్రే మునిసిపల్ సిబ్బంది తీసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక మాజీ ప్రధానికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ.. జెండాలు పీకేసిన రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలు తీసిన మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎందరో యువకులు, నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకుని సాధించుకున్న తెలంగాణను నిర్మాణాత్మకంగా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు.

అలాంటి యువతను ఆశలపై సీఎం కేసీఆర్ నీళ్లుచల్లారని ధ్వజమెత్తారు. దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. దేశ యువత అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్ అని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించేందుకు తెలంగాణ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి నాయకులు గాజంగి నందయ్య, రాజిరెడ్డి, దుర్గయ్య, జీవన్, గుండా మధు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed