గొర్రెల కోసం గోస.. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం

by Disha Web Desk 12 |
గొర్రెల కోసం గోస.. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం
X

దిశ, కరీంనగర్​ బ్యూరో : ప్రభుత్వం రాయితీపై అందించే రెండో విడత గొర్రెలు ఎప్పుడు వస్తాయా అని గొల్ల, కురుమలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తులను పెంచడం, తద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గొల్ల, కురుమల ఆర్థిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన గొల్ల, కురుమలను జిల్లా పశుసంవర్ధక శాఖ ద్వారా గుర్తించి రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి యూనిట్​కు 20 ఆడ గొర్రెల తోపాటు ఒక మగ గొర్రెను అందజేయాలని నిర్ణయించారు. తొలి విడత యూనిట్​ ధర రూ.1.25లక్షలు కాగా, పెరిగిన ధరలతో ప్రస్తుతం యూనిట్​ ధరను ప్రభుత్వం రూ.1.75లక్షలకు పెంచింది. తొలి విడత గొర్రెల యూనిట్లను 2018-19 ఏడాదిలో పంపిణీ చేయగా రెండో విడత కోసం గొల్ల, కురుమలు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది గొల్ల కురుమలు ప్రభుత్వానికి డీడీలు చెల్లించి గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా...

పెద్దపల్లి జిల్లాలో మొత్తం 21,108 యూనిట్లకు గాను తొలి విడతలో 10,565 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడతలో మిగిలిన 10,914 యూనిట్లు గ్రౌండింగ్​ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. పెద్దపల్లి జిల్లాలో 1,110మంది లబ్దిదారులు తమ వాటా కింద ప్రభుత్వానికి రూ.43,750చెల్లించారు. మిగిలిన వారు సైతం డీడీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ గొర్రెల పంపిణీ విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అర్హులైన వారి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు డీడీలు తీసుకోవడం లేదు. జగిత్యాల జిల్లాలో మొత్తం 20,100యూనిట్లకు గాను తొలి విడతలో 9,738యూనిట్లు గ్రౌండింగ్​ కాగా, రెండో విడత కోసం 7,716యూనిట్ల కోసం లబిద్దారులు డీడీలు తీయగా వెయ్యికి పైగా యూనిట్లు అందించాల్సి ఉంది.

కరీంనగర్​ జిల్లాలో తొలి విడతలో 13,519యూనిట్లు గ్రౌండింగ్​ చేయాల్సి ఉండగా 13,002యూనిట్లు గ్రౌండింగ్​ అయ్యాయి. రెండో విడతకు సంబంధించి 13,415యూనిట్లు గ్రౌండింగ్​ చేయాల్సి ఉంది. హుజురాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గానికి చెందిన గొల్ల కురుమలకు 3,600 యూనిట్లు గ్రౌండింగ్​ చేశారు. కరీంనగర్​, చొప్పదండి, మానకొండూర్​ నియోజకవర్గాలకు చెందిన గొల్ల, కురుమలకు 9వేలకు పైగా యూనిట్లు అందజేయాల్సి ఉంది. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 16,162గొర్రెల యూనిట్లు గ్రౌండింగ్​ చేయాల్సి ఉండగా అందులో తొలి విడతలో 8,150యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో విడతలో 8,009యూనిట్లు లక్ష్యం కాగా, మరో 2,700లకు పైగా యూనిట్లు అందజేయాల్సి ఉంది.

ఎన్నికల ముందు పంపిణీ మాట..

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మంత్రివర్గ సమావేశంలో రెండో విడత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభిస్తామని ప్రకటించడంతో గొల్ల కురుమలకు గొర్రెలు వస్తాయని సంతోషించారు. డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ గొర్రెల పంపిణీ కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఏప్రిల్​లో ప్రారంభించి సెప్టెంబర్​ వరకు పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. అయినా ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. తమకు గొర్రెలు ఇవ్వకుంటే ఇవ్వకపోయినా, కనీసం తాము చెల్లించిన డీడీలైనా తమకు అందజేయాలని పలుమార్లు గొల్ల కురుమలు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని గొల్లకురుమలు కోరుతున్నారు.


Next Story