దుబాయ్‌లో బతుకమ్మ సంబురాలు.. 11 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా వేడుకలు

by Disha Web Desk 4 |
దుబాయ్‌లో బతుకమ్మ సంబురాలు..  11 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా వేడుకలు
X

దిశ, రాజన్నసిరిసిల్ల: దుబాయ్ ఈటీసీఏ ఆధ్వర్యంలో అక్టోబర్‌‌ 2న ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఈటీసీఏ యూఏఈ అధ్యక్షులు రాధారపు సత్యం పేర్కొన్నారు. శుక్రవారం దుబాయ్ లో నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సారి ఎన్నడూ లేని విధంగా ఈటీసీఏ తెలంగాణ సంఘంతో పాటు తెలుగు అసోసియేషన్‌‌ కలిపి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 12వ సారి నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలకు దుబాయ్ లో ఉన్న తెలంగాణ అక్క చెల్లెళ్లు, అన్న, తమ్ముళ్లు, కుటుంబ సభ్యులతో , స్నేహితులతో తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి తరలి రావాలని ఈటీసీఏ అధ్యక్షులు రాధారపు సత్యం పిలుపునిచ్చారు.

తెలంగాణ నుంచి గాయకులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పోటీలు, బతుకమ్మ పాటల పోటీలు, చిన్నారుల సంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సద్దుల బతుకమ్మ సంబరాలు విజయవంతం చేయాలని అధ్యక్షుడు రాధారపు సత్యం తెలిపారు. అక్టోబర్‌‌ 2న యూఏఈలోని ఇండియన్‌‌ అసోసియేషన్ అజ్మాన్‌‌ లో ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ బతుకమ్మ వేడుకలు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయన్నారు. గల్ఫ్‌‌ దేశంలో జరుపుకుంటున్న ఈ వేడుకలకు యూఏఈలో ఉంటున్న వారందరు కదిలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీచర కిరణ్‌‌కుమార్‌‌, సురేష్‌‌, అరవింద్‌‌, వినోద్‌‌ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed