పసిపాప మృతికి కారకులైన చర్యలు తీసుకోవాలి

by Disha Web Desk 1 |
పసిపాప మృతికి కారకులైన చర్యలు తీసుకోవాలి
X

దిశ, కరీంనగర్ టౌన్ : ప్రభుత్వ మాత, శిశు ఆరోగ్య కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి పసిపాప మృతికి కారకులైన వైద్యులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని, చైల్డ్ డెవెలప్ మెంట్ ఆఫీసర్లు తక్షణమే విచారణ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ మాత, శిశు ఆరోగ్య కేంద్రం ముందు డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ బంధువులతో ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.

అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్, తిరుపతి మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం గర్భవతి శ్వేత ప్రసవానికి వచ్చిందని, రాత్రి 12 గంటల ప్రాంతంలో బాబు పుట్టాడని వైద్యులు తెలిపారని అన్నారు. వైద్యులు సమయపాలన పాటించకపోవడం వల్ల ఉదయం 5 గంటల ప్రాంతంలో బాబు చనిపోయాడని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్య సిబ్బంది వారి సొంత ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేసి డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలకు న్యాయమైన వైద్యం అందించి రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే.. పసిపాపల మృతికి కారకులవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో డాక్టర్లు లేకపోవడం వల్ల పసి పిల్లలు, గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బాబును పరిశీలిస్తే ఎడమచేతి విరిగిపోయినట్టు ఉందని, శరీరభాగాలపై గాయాలు కనబడుతున్నాయని తెలిపారు.

అనుభవం ఉన్న వైద్యులు కూడా పిల్లలను పరీక్షించకుండా కిందిస్థాయి సిబ్బందిని వైద్యం అందించాలని ఆదేశించడం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. పసిపిల్లల మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం, చైల్డ్ డెవెలప్ మెంట్ ఆఫీసర్లు తక్షణమే స్పందించి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జి.లక్పతి నాయక్, నాయకులు లక్ష్మణ్, నవీన్, రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed