జైపాల్‌కు నై.. కసిరెడ్డికే జై.. కాక రేపుతున్న కల్వకుర్తి పాలిటిక్స్!

by Disha Web Desk 4 |
జైపాల్‌కు నై.. కసిరెడ్డికే జై.. కాక రేపుతున్న కల్వకుర్తి పాలిటిక్స్!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ / కల్వకుర్తి: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలోనూ జైపాల్ రెడ్డికి టికెట్టు ఇవ్వొద్దనే డిమాండ్ బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఇస్తే మేమందరం కలిసి పని చేస్తాం లేదా బీసీలకు ఇవ్వాల్సి వస్తే మాలో ఒకరికి ఇవ్వాలని అధికార బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించిన కసిరెడ్డి నారాయణరెడ్డి అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించాడు. ఈ నేపథ్యంలో ఆయనను అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది.

కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఏదో ఒక రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాలన్న లక్ష్యంతో కసిరెడ్డి 2018 ఎన్నికలలో పోటీ చేయాలి అనుకున్నారు. కానీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికలలో గెలుపొందిన జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య సఖ్యత కుదరలేదు. ఇరువురు నేతల మధ్య కోల్డ్ వార్ సాగుతూ వచ్చింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నియోజకవర్గంలోని పలు మండలాల రైతులకు సాగునీరు అందించేందుకు కసిరెడ్డి సొంత నిధులను కేటాయించి కృషి చేయడం, అందరితో కలిసిపోయే మనసుతో ఉండడంతో పార్టీ శ్రేణుల్లో మంచి గుర్తింపు లభించింది.

ఈ క్రమంలో నియోజకవర్గంలోని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, మున్సిపల్ చైర్మన్ హెడ్మాసత్యం, ప్రముఖ సామాజికవేత్త ఉప్పల వెంకటేష్, తదితర ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎక్కువ సంఖ్యలో కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీ శ్రేణులతో పెద్దగా కలిసిపోకపోవడం, ఎమ్మెల్సీ పర్యటనలను ఎప్పటికప్పుడు వ్యతిరేకించడం, నియోజకవర్గంలో భూదందాలు ఎక్కువగా జరుగుతూ ఉండడం, వంటి అంశాలు జైపాల్ యాదవ్ కు ఇబ్బందికరంగా మారాయి.

ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి సిట్టింగులకే టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు పతాకాస్థాయికి చేరాయి. ఈ అంశం అధిష్టానం దృష్టి కూడా వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. కొన్ని సందర్భాలలో ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జరిగే పర్యటనలకు దూరంగా ఉన్నప్పటికిని మాజీమంత్రి చిత్తరంజన్ దాస్, తదితర నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కసిరెడ్డిని ఆ సమావేశాలకు ఆహ్వానించి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. జైపాల్ యాదవ్ కు కాకుండా కసిరెడ్డి నారాయణరెడ్డి కి టికెట్ ఇవ్వాలని, బీసీలకు ఇవ్వాల్సి వస్తే తమలో ఒకరికి టికెట్ కేటాయించాలని మాజీమంత్రి చిత్తరంజన్ దాస్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ సమావేశాలలో ప్రస్తావిస్తున్నారు.

ఎట్టి పరిస్థితులలోనూ జైపాల్ యాదవ్ కు అండగా నిలిచే ప్రసక్తే లేదు అంటూ బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సీటును గెలిపించుకోవాలి అంటే తప్పనిసరిగా జైపాల్ యాదవ్ కు టికెట్ ఇవ్వొద్దు, మాలో ఎవరికీ ఇచ్చిన అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిచి తీరుతాం అంటూ స్పష్టం చేస్తున్నారు. అధిష్టానం ఇక్కడ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థిని మార్చకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసైనా సరే ఎమ్మెల్యేను ఓడిస్తామంటూ చేస్తున్న వ్యాఖ్యలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మొత్తంపై కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి పోటీ చేస్తే ఇతర పార్టీల వారు కూడా అండగా నిలుస్తారని వారు పేర్కొంటున్నారు. మొత్తంపై అత్యధిక ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం పై ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ నియోజక వర్గం తర్వాత కల్వకుర్తి కి సంబంధించిన రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తిస్థాయిలో స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. వ్యూహాత్మకమా, ఆత్మరక్షణా?



Next Story