కవిత అరెస్ట్ బ్రేక్‌కు కారణమదే.. KA పాల్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
కవిత అరెస్ట్ బ్రేక్‌కు కారణమదే.. KA పాల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ బ్యూరో, సంగారెడ్డి : లిక్కర్ స్కాం వ్యవహారంలో కవిత అరెస్ట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురును అరెస్ట్ చేయకపోతే 40 సీట్లు ఇస్తానని బీజేపీతో సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారన్నారు. ఆ ఒప్పందంతోనే అరెస్ట్ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటేనని కేఏ పాల్

ఆరోపించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్లేవర్డ్ హోటల్ లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20న సదాశివపేట పాల్ ఛారిటీ సిటీలో సంగారెడ్డి అభివృద్ధి గురించి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని 83 గ్రామాలలో 10 వేల మంది, సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోనే 30 వేల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు.1200 ఎకరాల విస్తీర్ణంలో తన ఛారిటీ సిటీ నిర్మించి ఎందరికో భవిష్యత్తు ఇచ్చానని గుర్తు చేశారు.

అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డికి రూ. 20 వేల కోట్లు ఇవ్వనందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ధర్నాలు చేయించి మూసి వేయించారని ఆరోపించారు. వైఎస్ తొత్తుగా మారిన జగ్గారెడ్డి ఛారిటీ సిటీ నుంచి వెయ్యి మంది పిల్లల భవిష్యత్తు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక జగ్గారెడ్డి ఏం చేశారని పాల్ సూటిగా ప్రశ్నించారు. 1000 పడకల ఆసుపత్రి నిర్మించి ఛారిటీ ద్వారా ఉచిత హెల్త్ కార్డులు ఇచ్చి వైద్య సేవలు అందించానని చెప్పారు.

డబ్బులు తీసుకుని BRS పార్టీలో చేరుతావా..? అభివృద్ధి కోసం ప్రజాశాంతి పార్టీలో చేరుతావో తేల్చుకోవాలని జగ్గారెడ్డికి సూచించారు. నాతో పెట్టుకున్న రాజశేఖర్ రెడ్డి ముక్కలు..ముక్కలు అయ్యారన్నారు. తనని సీఎం చేస్తే ప్రతి గ్రామానికి రూ. 50, మున్సిపాలిటీకి రూ.200 కోట్లు స్వంతగా ఇచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉపాధి హామీతో ముందుకు వస్తున్నానని పాల్ వెల్లడించారు. గద్దర్ బతికున్నప్పుడు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వలేదని, ఓట్ల కోసం చనిపోయాక అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారని ఘాటు విమర్శలు చేశారు.

సీఎం కేసీఆర్ వద్ద రూ.5 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. ధరణి ద్వారా రూ.12 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిస్థితి ఎమిటీ..? అని ప్రశ్నించారు. ప్రభాకర్ తన పార్టీలోకి వస్తే ఏటా అభివృద్ధికి రూ.కోటి ఇస్తానని చెప్పారు. కేటీఆర్‌కు తప్ప ఎవరికీ ఐటీ నాలెడ్జ్ లేదన్నారు. మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ భజన ఆపితే బాగుంటుందని చురకలు అంటించారు. మోదీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ కుటుంబాన్ని ఢీ కొనే సత్తా తనకు ఉందని పాల్ ధీమా వ్యక్తం చేశారు. మోడీ అప్పుల దేశంగా మార్చారని, అయితే తన జీవితాన్ని నాశనం చేసింది జగ్గారెడ్డేనన్నారు. చారిటీని మూసివేసి పిల్లల కడుపు కొట్టాడని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. పీసీసీ చీఫీ రేవంత్ రెడ్డికి అస్సలు క్యాడర్ లేదని పాల్ అన్నారు.



Next Story

Most Viewed