పంచాయతీ కార్యదర్శులను తొలగిస్తామని బెదిరించడం అప్రజాస్వామికం: జూలకంటి రంగారెడ్డి

by Disha Web Desk 19 |
పంచాయతీ కార్యదర్శులను తొలగిస్తామని బెదిరించడం అప్రజాస్వామికం: జూలకంటి రంగారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రొబేషన్‌ కాలం ముగిసినందున జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేసి, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి, సమ్మెను విరమింపజేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 2019 ఏప్రిల్‌ నుంచి వివిధ గ్రామపంచాయతీల్లో పని చేస్తున్నారని తెలిపారు. నోటిఫికేషన్‌ ప్రకారం వీరి ప్రొబేషన్‌ కాలం ఏప్రిల్‌ 2022కే పూర్తయ్యిందని, అయినా మరొక సంవత్సరం పెంచుతూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందన్నారు. ఈ గడువు కూడా 11ఏప్రిల్‌ 2023తో ముగిసిందని వివరించారు.

తెలంగాణలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ వ్యవస్థ ఉండకూడదన్న సీఎం, వీరి నాలుగేళ్ళ ప్రొబేషన్‌ గడువు పూర్తయినప్పటికీ రెగ్యులరైజ్‌ చేయకపోవడం బాధాకరమన్నారు. జేపీఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ గ్రామాలకు అనేక అవార్డులు కూడా వీరు తీసుకొచ్చారన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వీరి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే, వారిని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, కార్మికులనే విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరించడం అప్రజాస్వామికమని విమర్శించారు.

Next Story