కవిత బెయిల్‌పై తీర్పు రిజర్వు.. మే 2న వెల్లడి కానున్న నిర్ణయం

by Disha Web Desk 1 |
కవిత బెయిల్‌పై తీర్పు రిజర్వు.. మే 2న వెల్లడి కానున్న నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న రెండు బెయిల్ పిటిషన్లపై రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. సీబీఐ, ఈడీ అరెస్టు వ్యవహారాల్లో కవిత వేర్వేరు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. సీబీఐ అరెస్టు విషయంలో వాదనలు కంప్లీట్ కావడంతో స్పెషల్ జడ్జి కావేరీ భవేజా తీర్పును మే 2న వెల్లడించనున్నట్లు పేర్కొని రిజర్వులో ఉంచారు. ఈడీ అరెస్టు విషయంలో మాత్రం సోమవారం వాదనలు కొనసాగినా.. అసంపూర్తిగా ముగియడంతో మంగళవారానికి వాయిదా పడ్డాయి. వాదనల అనంతరం తీర్పును వెల్లడిస్తారా.. లేక సీబీఐ కేసు తరహాలోనే మే 2 వరకు రిజర్వు చేస్తారా.. అనే ఆసక్తి నెలకొన్నది. కవితకు గతంలో విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 23న ముగుస్తుండడంతో తీహార్ జైలు నుంచే ఆమెను వర్చువల్‌గా హాజరు పరిచే అవకాశం ఉంది.

సీబీఐ అరెస్టు అక్రమం.. కవిత తరఫు న్యాయవాది

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను గత నెల 15న ఈడీ అరెస్టు చేసిన అనంతరం ఈ నెల 11న సీబీఐ కూడా తీహార్ జైల్లో ఉండగానే అరెస్టు చేసింది. అరెస్టు చేసినప్పటి నుంచి కస్టడీల ప్రశ్నించిన తర్వాత కూడా ఎలాంటి మెటీరియల్ లేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, ఒకవైపు ఈడీ కస్టడీలో ఉండగానే సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు. అరెస్టు చెయ్యాల్సిన అవసరం లేకపోయినా, సుప్రీంకోర్టుకు స్పష్టంగా అండర్‌టేకింగ్ ఇచ్చినా దానికి విరుద్ధంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీకి ఆమె స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారని గుర్తు చేశారు. నళినీ చిదంబరం కేసులో గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు కవిత విషయంలోనూ వర్తిస్తుందని అన్నారు.

ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడే కేసులకు అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికీ అరెస్టుకు సరైన కారణాలు లేవన్నారు. ఇదిలా ఉండగా సీబీఐ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని, ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నదని, ఆమెను బెయిల్‌మీద బైటకు పంపితే ఆటంకం కలుగుతుందని, బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. కవిత బైటకు వెళ్తే దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారని, ఈ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని నొక్కిచెప్పారు. ఇరువైపులా వాదనలను విన్న స్పెషల్ జడ్జి కావేరీ భవేజా... వాదనలు కంప్లీట్ అయ్యాయని ప్రకటించి తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. మే నెల 2వ తేదీన తీర్పును వెల్లడించనున్నట్లు తెలిపారు.

నిందితుల స్టేట్‌మెంట్లపై లోతుగా వాదనలు..

లిక్కర్ కేసులో అరెస్టయ్యి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న కవిత తరఫు న్యాయవాది ఈడీ వ్యవహారంలో బెయిల్2పై వాదిస్తూ... మహిళగా ఉన్న హక్కు మాత్రమే కాక, పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని కోర్టుకు వివరించారు. విచారణకు సంపూర్ణంగా సహకరిస్తున్నందున ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదన్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై మొత్తం పది స్టేట్‌మెంట్లు ఇచ్చారని, అందులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆమె తరపు న్యాయవాది నొక్కిచెప్పారు. అనుమానితురాలిగా కూడా లేని ఆమెను నింధితురాలిగా మార్చారని ఆక్షేపించారు. ఐదారు గంటలపాటు ఆమెను విచారించే సమయంలో ఒక టెర్రరిస్టును, కరుడుగట్టిన నేరస్థుల తరహాలో ఈడీ అధికారులు ప్రవర్తించారని ఆరోపించారు.

గత నెల 15న ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలోకి తీసుకున్న తర్వాత కేజ్రీవాల్‌తో కలిపి విచారించడంలో ఈడీ విఫలమైందన్నారు. నిందితుడగా ఉన్న విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తారని, ఆయనను కేవలం సోషల్ మీడియా అంశంమీదనే కవిత భేటీ అయ్యారని న్యాయవాది వివరించారు. ఆడిటర్ బుచ్చిబాబు నాలుగు స్టేట్‌మెంట్లు ఇచ్చారని, ఈడీకి అనుకూలంగా ఇచ్చినందునే ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు. బీజేపీ నుంచి పొత్తులో ఉన్న పార్టీ నుంచి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తున్నారని, నిందితుడిగా చెప్తున్నా ఆ పార్టీలో ఎందుకు చేరారో అర్థమవుతుందన్నారు. అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి విరాళాలు ఇచ్చారని, ఇప్పుడు బెయిల్‌పై బైట ఉన్నారని గుర్తుచేశారు.

వీరంతా ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా కవితను అరెస్ట్ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. కవిత తన ఫోన్లను ఫార్మాట్ చేశారని, డిజిటల్ ఎవిడెన్సు లేకుండా చేశారని ఈడీ లేవనెత్తిన ఆరోపణలపై ఆమె తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ, ఆమె వాడిన ఫోన్లను తన సిబ్బందికి ఇచ్చారని, ఆ సమయంలో వారు ఫార్మాట్ చేయడం సహజంగా జరిగేదేనని నొక్కిచెప్పారు. ఉద్దేశపూర్వకంగానే ఫోన్లను ఫార్మాట్ చేశారన్న ఈడీ వాదనను ఆమె లాయర్ తప్పుపట్టారు. ఈడీ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని, కవిత మొత్తం 11 మొబైల్ ఫోన్లలోని డేటాను ధ్వంసం చేశారని, ఇదే విషయాలను కేసు ఫైల్‌లోనూ చెప్పామన్నారు. వాడిన అన్నీ మొబైల్ ఫోన్లను ఈడీకి ఇచ్చామన్న కవిత న్యాయవాది చెప్తున్నా ఆరు ఫోన్లలోని డేటా పక్కాగా ఉన్నట్లు ఈడీయే గతంలో చెప్పిందని గుర్తుచేశారు. వాదనలు అసంపూర్తిగా ముగియడంతో మంగళవారం తిరిగి కంటిన్యూ కానున్నాయి. ఆ తర్వాత కవితకు ఈడీ వ్యవహారంలో బెయిల్‌పై స్పెషల్ జడ్జి కావేరీ భవేజా నిర్ణయం తీసుకోనున్నారు.

Read More...

కవితకు మరోసారి నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్



Next Story

Most Viewed