రేపు తెలంగాణకు జేపీ నడ్డా

by Dishafeatures2 |
jp nadda
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహా జనసంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ‘నవ సంకల్ప సభ’ పేరిట ఆదివారం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఈ సభకు హాజరై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభకు ప్రాధాన్యత ఏర్పడింది. మోడీ 9 ఏండ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు ‘నవ సంకల్ప సభ’ అని నామకరణం చేశారు. దాదాపు లక్ష మందితో ఈ సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కాగా, నడ్డా తన పర్యటనలో ఇద్దరు ప్రముఖులతో భేటీ కానున్నారు. ఇదిలా.. ఉండగా జేపీ నడ్డా ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 12.55 గంటల నుంచి 1:45 వరకు పార్టీ నేతలతో సమావేశంకానున్నారు.

ఆపై 2:30 గంటల నుంచి 2:45 వరకు ‘సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా టోలిచౌక్‌లోని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో నడ్డా భేటీ కానున్నారు. అనంతరం 2:55 నుంచి 3:10 గంటల వరకు జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్‌లోని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంతితో ఆయన భేటీ కానున్నారు. మోడీ 9 ఏండ్ల పాలన విజయాలను వివరించడంతోపాటు మోడీ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను అందజేయనున్నారు. ప్రధాని మోడీ 9 ఏండ్ల పాలన విజయాలను వివరించడంతోపాటు మోడీ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను అందజేయనున్నారు. అక్కడి నుండి సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ వెళ్లి ప్రత్యేక హెలికాప్టర్ లో నడ్డా నాగర్ కర్నూల్ కు చేరుకుంటారు. నేరుగా జెడ్పీ హైస్కూలు మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. దాదాపు గంటన్నరపాటు సభలోనే ఉంటారు. ఈ సందర్భంగా మోదీ 9 ఏండ్ల పాలనలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నడ్డా ఎండగట్టనున్నారు.



Next Story

Most Viewed