జార్ఖండ్ పాలిటిక్స్ హైదరాబాద్ కు షిఫ్ట్!

by Disha Web Desk 13 |
జార్ఖండ్ పాలిటిక్స్ హైదరాబాద్ కు షిఫ్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్ కు మకాం మారబోతున్నట్లు తెలుస్తోంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలతో అలర్ట్ అయిన జార్ఖండ్ లోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ కూటమి పెద్దలు తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇవాళ సాయంత్రమే ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్ కు షిప్ట్ కావడం వెనుక జేఎంఎంకు మద్దతు నిలుస్తున్నది టీ కాంగ్రెస్ నేతలా లేక బీఆర్ఎస్ పార్టీనా అనేది ఉత్కంఠగా మారింది.

జేఎంఎం ఎమ్మెల్యేల వెనుక ఉన్నదెవరు?:

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జేఎంఎం శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నేత చంపయ్ సోరెన్ ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా హైదరాబాద్ కు షిప్ట్ కాబోతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. చంపయ్ సోరెన్ కు సర్కార్ ఏర్పాటు కోసం గవర్నర్ నుంచి ఆహ్వానం అందలేదు. చంపయ్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఆయనకు తగినంత మద్దతు లేదని బీజేపీ వాదిస్తోంది. 47 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని చంపయ్ సోరెన్ చెబుతుంటే గవర్నర్ మాత్రం ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం సంచలనం అవుతున్నది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలను జేఎంఎం హైదరాబాద్ కు తరలించాలనే నిర్ణయం ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు వస్తే వారికి ఎవరి అండతో వస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇన్నాళ్లు జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొనాసాగింది. ఇండియా కూటమిలోనూ జేఎంఎం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో అయితేనే తమ ఎమ్మెల్యేలు సేఫ్ అని జేఎంఎం నాయకత్వం భావిస్తోందా లేక గత పరిచయం నేపథ్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేల రాజకీయం వెనుక కేసీఆర్ అండదండలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మరో వైపు తన అరెస్ట్ పై హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రేపు సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్నది.



Next Story

Most Viewed