మల్లారెడ్డి పై ఐటీ రెయిడ్స్.. గవర్నర్‌పై నెటిజన్ల ఆగ్రహం

by Disha Web |
మల్లారెడ్డి పై ఐటీ రెయిడ్స్.. గవర్నర్‌పై నెటిజన్ల ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య అగాధం రోజు రోజుకు పెరిగిపోతోంది. గవర్నర్ గీత దాటి ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల విమర్శలకు గవర్నర్ తమిళిసై సైతం అందే స్ట్రాంగ్ రిప్లే ఇస్తున్నారు. దీంతో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య పచ్చ గట్టి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం నడుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాలపై తమిళిసై నేరుగా ప్రభుత్వాన్ని వివరణ కోరుతుండటం రాజకీయంగా మరింత హీట్ పెంచుతోంది. తాజాగా మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాల నేపథ్యంలో గవర్నర్ పేరు మరోసారి తెరపైకి వస్తోంది. ఇంతకీ మల్లారెడ్డిపై ఐటీ దాడులకు గవర్నర్ కు సంబంధం ఏంటనేగా మీ డౌట్?

ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు కొంత మంది దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న గవర్నర్.. సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు. ఇదొక్క ఘటననే కాదు మిగతా చాలా అంశాల్లో ఆమె ప్రభుత్వం నుంచి వివరణలు కోరుతోంది. తాజాగా మంత్రి ఇంట్లో సోదాల్లో భాగంగా మల్లారెడ్డి మనవరాలు శ్రేయారెడ్డిని ఇంటి నుంచి కోటిలోని బ్యాంక్‌కు ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. రాత్రిపూట బ్యాంకు లాకర్లు తెరవాలంటూ ఆమెను మహిళా పోలీసులు లేకుండా పురుషులైన ముగ్గురు సీఆర్పీఎఫ్ పోలీసులు తరలించారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేడీ కానిస్టేబుల్స్ లేకుండా మహిళను రాత్రిపూట ఎలా తీసుకువెళ్తారంటూ తీవ్ర స్థాయిలో మల్లారెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవహారంలోకి కొంత మంది నెటిజన్లు గవర్నర్‌ను లాగుతున్నారు. అర్వింద్ ఇంటిపై దాడి విషయంలో వెనువెంటనే స్పందించి డీజీపీని నివేదిక కోరిన గవర్నర్.. ఒక మహిళను అర్థరాత్రి మహిళా సిబ్బంది లేకుండా పోలీసులు తీసుకువెళ్తే సాటి మహిళగా వివరణ కోరరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న తమిళిసై మరి ఈ అంశంలో ఎలా రియాక్ట్ అవుతారాలో చూడాలి మరి.

Next Story

Most Viewed