మరో BRS ఎమ్మెల్యేపై ఐటీ దాడులు

by Disha Web Desk 4 |
మరో BRS ఎమ్మెల్యేపై ఐటీ దాడులు
X

‌దిశ తెలంగాణ క్రైం బ్యూరో : బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లపై బుధవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఎన్నికలు మరికొన్ని నెలల్లో ఉండగా పార్టీకి చెందిన ముగ్గురు బడా నాయకులపై ఐటీ దాడులు జరగటం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం సృష్టిస్తోంది.

పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటిపై...

బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు బుధవారం దాడి జరిపారు. పదిహేనుకు పైగా బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు భువనగిరిలోని ఎమ్మెల్యే నివాసంతోపాటు కొత్తపేటలోని కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా హైదరాబాద్ కొత్తపేటలో మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్, హిట్ ల్యాండ్ టెక్నాలజీస్ సంస్థలు నడుస్తున్నాయి.

దీంతోపాటు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గడిచిన మూడు నాలుగేళ్లుగా పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టుగా సమాచారం అందటంతో ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచే దాడులు చేపట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఐటీ అధికారుల చేతికి కొన్ని కీలక డాక్యుమెంట్లు దొరికినట్టు సమాచారం. దాంతోపాటు ఆఫీసుల్లోని కంప్యూటర్లను ఐటీ అధికారులు విశ్లేషస్తున్నట్టు తెలిసింది.

ఎంపీ ఇంట్లో కూడా...

ఇదిలా ఉండగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేసారు. కొండాపూర్‌లోని ఆయన ఇంటికి పొద్దున్నే చేరుకున్న ఐటీ అధికారులు కేంద్ర బలగాల బందోబస్త్ మధ్య సోదాలు చేస్తున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఓ కంపెనీలో ఆయన డైరెక్టర్‌గా ఉన్నట్టు తెలిసింది.

మరో ఎమ్మెల్యే వ్యాపార సంస్థలపై..

ఇక, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థ జేసీ బ్రదర్స్‌పై కూడా ఐటీ అధికారులు దాడి చేసారు. కేపీహెచ్‌బీ భాగ్యనగర్ కాలనీలో ఉన్న దుకాణానికి వచ్చిన అధికారులు షాప్ షట్టర్లు మూసి వేయించి సోదాలు చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలు, చెల్లించిన పన్ను వివరాలను సేకరిస్తున్నారు. ఇక్కడ కూడా కేంద్ర బలగాలు బందోబస్తులో ఉండటం గమనార్హం.

గతంలో మంత్రి మల్లారెడ్డి ఇల్లు, విద్యా సంస్థలపై జరిగిన ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. వరుసగా మూడు రోజులపాటు ఐటీ అధికారులు మల్లారెడ్డి, ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక, మరో మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. కాగా, ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాలు, ఆఫీస్‌లపై వరుసగా ఐటీ అధికారులు దాడులు చెయ్యడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

Next Story