కేసీఆర్ కుటుంబం కన్నా పెద్ద పగటి వేషగాళ్లు ఎవరున్నారు..? ఇందిరా శోభన్ ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్ కుటుంబం కన్నా పెద్ద పగటి వేషగాళ్లు ఎవరున్నారు..? ఇందిరా శోభన్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కమీషన్ల ప్రభుత్వమని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరాభోభన్ బుధవారం ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం జరుపుకోవాలని ప్రజల సొమ్ముతో అప్పనంగా రాజకీయ ప్రచారం చేస్తున్నారని, నాగర్ కర్నూల్ వెళ్లిన సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తీసుకుని మెగా కృష్ణారెడ్డిని జాతీయస్థాయిలో ధనవంతుడిగా నిలబెట్టారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష ఇరవై వేల కోట్లుగా చేసి కమీషన్ల ప్రభుత్వంగా బీఆర్ఎస్ పేరు గడించిందని ఆమె ఆరోపణలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యాన రాష్ట్రం అప్పుల పాలైనందుకు సంబురాలు చేసుకోవాలా? అని ఆమె ప్రశ్నించారు. లేక బాహుబలి పంపులు మునిగి 10 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఇంకా పోలీసు గస్తీలోనే ఉన్నందుకు సంబరాలు చేసుకోవాలా? మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వట్టెం భూ నిర్వాసితులపై లాఠీచార్జీ చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారని ఆమె ధ్వజమెత్తారు. 1957 నుంచి 2014 వరకు ఉన్న ముఖ్యమంత్రులు రూ.70 వేల కోట్ల అప్పు చేస్తే సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం ఆయన బంగారు కుటుంబం కోసం రూ.నాలుగున్నర లక్షల కోట్ల అప్పుచేశారని ఆమె ఆరోపణలు చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కుటుంబం కన్నా పెద్ద పగటివేషగాళ్లు ఎవరున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్ దోచుకున్న సొమ్ముతో రాష్ట్ర రాజకీయాలే కాక దేశ రాజకీయాల కోసం తహతహలాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప సంబరాలు చేసుకునే పరిస్థితి ఎవరికైనా ఉందా అని కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed