కడప ఎంపీ సీటు కోసం వివేకాను హత్య చేశారు: వైఎస్ సునీతా రెడ్డి

by Disha Web Desk 23 |
కడప ఎంపీ సీటు కోసం వివేకాను హత్య చేశారు: వైఎస్ సునీతా రెడ్డి
X

దిశ, హిమాయత్ నగర్: కడప ఎంపీ సీటు కోసం వివేకా హత్య చేశారని.. వైఎస్ సునీతా రెడ్డి అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు.. వారిని కాపాడుతోంది ఎవరు.. సీఎం జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేకా కుమార్తె సునీత రెడ్డి సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి పట్టుపడుతున్నారని, దీంతో ఆయన అడ్డు తొలగిస్తే.. షర్మిలకు సపోర్టు ఉండదని, ఇక తమకు ఎదురు ఉండదని భావించి.. వివేకను హత్య చేశారని.. ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి తనకు లభించిన ఆధారాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియ చేస్తున్నారని సునీత స్పష్టం చేశారు.

మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి నిందితుల పేర్లు చెప్పిందన్న సునీత, ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్‌, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ4 దస్తగిరి అని ఆమె తెలిపారు. ఏ1 ఎర్ర గంగిరెడ్డితో అవినాష్‌కు పరిచయం ఉందని, సునీల్‌ యాదవ్‌కు తమ్ముడు ఉన్నాడని అతడి పేరు కిరణ్‌ యాదవ్‌ అని అన్నారు. అవినాష్‌, భాస్కర్‌రెడ్డితో కిరణ్‌ యాదవ్‌ ఉన్న ఫొటోలు చూపించిన సునీత, ఏ3 ఉమాశంకర్‌రెడ్డితోనూ అవినాష్‌కు పరిచయం ఉందని అన్నారు. ఉమాశంకర్‌ రెడ్డికి అవినాష్‌ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ వివరాలను సైతం సునీత బహిర్గతం చేశారు. ఎం.వి.కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడన్న సునీత, శివ శంకర్‌ రెడ్డికి, ఎం.వి.కృష్ణారెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డి ఫోన్‌ మార్చి 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ ఉదయం వరకు స్విచ్ఛాఫ్​లో ఉందన్నారు.

హత్య జరుగుతున్న సమయంలో అవినాష్ - ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయని.. హత్యకు ముందు రోజు మార్చి 14వ తేదీన సునీల్ యాదవ్ గూగుల్ టేక్ ఔట్ చేసిన వివరాల ప్రకారం అవినాష్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నట్లు చూపించిందని, 15వ తేదీన హత్య జరిగిన రోజు సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డి ఇంటి వద్దే ఉన్నట్టు చూపించిందని తెలిపారు. గంగిరెడ్డి, సునీల్ యాదవ్​ల మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయని, ఐపీడీఆర్ డేటా ప్రకారం అర్ధరాత్రి 1.37 నిమిషాలకు గంగిరెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని తెలిపారు. అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల మధ్య నాలుగు కాల్స్ ఉన్నాయని, ఈ మధ్య సమయంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. హత్య జరిగిన తెల్లవారుజామున 4, 5 గంటల మధ్య చాలా సార్లు కాల్స్ చేశాడని, ఆ కాల్స్ ఎవరికి వెళ్లాయని ఆమె ప్రశ్నించారు.


Next Story