కారు కార్ఖానాకు పోయింది..చేయి పని అయిపోయింది : ఉత్తరాఖండ్ సీఎం

by Disha Web Desk 23 |
కారు కార్ఖానాకు పోయింది..చేయి పని అయిపోయింది : ఉత్తరాఖండ్ సీఎం
X

దిశ,ముషీరాబాద్: తెలంగాణలో కారు కార్ఖానాకు పోయింది చేయి పని అయిపోయిందని ఇంక కమల వికాసం జరగుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు దొంగలే అని చెప్పారు. కాళేశ్వరం మీద విచారణ జరుగుతోందా, కాంగ్రెస్ చెప్పినట్టుగా మహిళలకు రూ.2500 ఇస్తున్నారా, యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిరూ. 4వేలు ఏమయిందని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ యువ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరై నాయకులకు కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటించానని, పరిస్థితులు చూస్తుంటే మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని దేశమంతా స్పష్టం చేస్తుందన్నారు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకే చట్టం వర్తించాలని అందుకే యుసిసిని మేం తీసుకు వచ్చామని, ఉమ్మడి పౌర స్కృతిని ఏర్పాటుచేసిన మొదటి రాష్ట్రంగా నిలిచామని చెప్పారు.

అంబేద్కర్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం రిజర్వేషన్లు ఇస్తే స్వార్థ రాజకీయాల కోసం మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తాం అంటున్నారన్నారు. నేను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరు ముట్టుకోలేరని మోదీ చెబుతున్నారని అన్నారు. ఎలాంటి బాధ్యతలని అయినా సమర్థవంతంగా కిషన్ రెడ్డి నిర్వహిస్తారని, 45 ఏళ్లుగా ప్రజా జీవితంలో నిష్కలంకంగా సేవలందిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో కిషన్ రెడ్డి వంటి మంచి వ్యక్తి దొరకడని, అటువంటి వ్యక్తిని మరోసారి ఎంపీగా గెలిపించాలని ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కి అసలు పోటీ చేయలేదన్నారు. ఆయన గెలుపు ఖాయం అయిందని ఇందులో సందేహమే వద్దని చెప్పారు. మోడీ, కిషన్ రెడ్డి గెలుస్తారు. ఇక నేనొక్కడిని ఓటింగ్ కు పోకపోతే ఏమవుతుందని అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు వెళ్లి కిషన్ రెడ్డి కి ఓటు వేయాలని, ఇతరులతో ఓటు వేయించాలని విజ్ఞప్తి చేశారు.

దేశం కోసం మోదీని గెలిపించాలి: కిషన్ రెడ్డి

మోడీ నాయకత్వం దేశానికి చాలా అవసరమని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశం కోసం బీజేపీని గెలిపించి మోదీని మరోసారి ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. 13వ తేదీన ఉదయం పోలింగ్ బూత్ కి వెళ్లే ముందు దేశం కోసం మోడీకి ఓటేస్తున్నాం అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో వెళ్లి ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక పేదవాడి టాయిలెట్ల నుంచి మొదలుపెడితే చంద్రయాన్ వరకు ప్రగతిని సాధిస్తున్నామని చెప్పారు. దేశంలో ఉగ్రవాదం అన్నది కనిపించకుండా పోయిందంటే అది మోదీ ప్రభుత్వ ఘనవిజయమని అన్నారు. మోడీ ప్రభుత్వం చేసిన పనులపై ఎవరితోనైనా ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

యువశక్తి మన ప్రధాన బలం: డాక్టర్ కె.లక్ష్మణ్

యువశక్తి మన ప్రధాన బలమని, మోదీ నిర్మించే భవిష్యత్ భారత నిర్మాణంలో యువతే కీలకంగా మారనున్నారని చెప్పారు. దేశంలో భూతద్దం చూసి వెతికినా మోడీకి సరిపోయే వ్యక్తి కనిపించడం లేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే మోదీ ఎజెండా అని, యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని ఓటు వేయడం ద్వారా మోడీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సీఎం పుష్కర్ సింగ్ ధామీ యుసిసిని అమలు చేశారని, దేశమంతా యుసిసి అమలు కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని కాగానే దేశమంతా అమలు చేసి తీరుతామని చెప్పారు. ఈ సమ్మేళనంలో బీజేపీ సీనియర్ నాయకులు, యువ మోర్చా నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed