తలసాని కోటకు బీటలు?

by Dishafeatures2 |
తలసాని కోటకు బీటలు?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోటకు బీటలు వారుతున్నాయా? అందుకే ఆయన ప్రత్యామ్నాయ నియోజకవర్గం వెతుక్కుంటున్నారా? ఇదే ఇప్పుడు గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆయన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం 1978లో ఏర్పాటు కాగా 9 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 5 సార్లు కాంగ్రెస్, 3 పర్యాయాలు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ గెలుపొందాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తలసాని 45.27 శాతంతో 56,475 ఓట్లు సాధించారు. 2018లో శాసనసభకు జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 66,464 ఓట్లు సాధించి మరోమారు ఘనవిజయం సాధించారు.

అయితే ఈ యేడాది చివరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మరోమారు సనత్ నగర్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్న ఆయనకు ఈసారి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదని, అందుకే ఆయన ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారనే చర్చలు గత కొన్ని నెలలుగా వినబడుతున్నాయి. దీనికితోడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌ను బరిలోకి దించినప్పటికీ బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతిలో సుమారు 62వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అదే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే మంత్రిగా తలసాని ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ ఉన్నా కొడుకును గెలిపించుకోలేకపోవడం, నాటి ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థికే ఊహించని విధంగా అత్యధిక మెజార్టీ సాధించడంతో ఆయన చరిస్మా నాటి నుంచే తగ్గిందనే ప్రచారం మొదలైంది. దీనికి 2020లో జరిగిన బల్దియా ఎన్నికలలో ఆయనకు కంచుకోటగా ఉన్న మార్కెట్ డివిజన్, రాంగోపాల్‌పేట, అమీర్‌పేట్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలుపొందడం దీనికి మరింత ఊతమిస్తోంది.

గోషామహల్‌కు మారుతారా..?

సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి కుమారుడు సాయికిరణ్ యాదవ్ పోటీ చేస్తారని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే బల్దియా ఎన్నికల అనంతరం ఆయన గోషామహల్ నియోజకవర్గంపై దృష్టిసారించారని పార్టీలో చర్చ మొదలైంది. దీనికి తోడు గోషామహల్ నియోజకవర్గంలో ఏచిన్న కార్యక్రమానికైనా ఆయన హాజరౌతుండడంతో ఇలాంటి ప్రచారాలకు బలం చేకూరుతోంది. సనత్ నియోజకవర్గంలో సుమారు రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేయించినా ప్రజలలో వ్యతిరేకత ఉందనేది మంత్రి గుర్తించారని, అందుకే కొడుకుకు సనత్ నగర్ వదిలేసి తాను నియోజకవర్గం మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికితోడు కుమారుడు సాయికిరణ్ యాదవ్‌ను సనత్ నగర్ నుంచి బరిలోకి దించడం ద్వారా గతంలో ఎంపీగా ఓటమిపాలైన సింపతి ఓటర్లలో ఉందని, తద్వారా అసెంబ్లీకి గెలిచే అవకాశం ఉందని తలసాని భావిస్తున్నారనే గుసగుసలు స్థానికంగా వినబడుతున్నాయి.

అసమ్మతి..

సనత్ నగర్ నియోజకవర్గంలో నామినేటెడ్, పార్టీ పదవులు వస్తాయని ద్వితీయ శ్రేణి నాయకులు ఆశపడ్డారు. అయితే వారికి పదవులు దక్కకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి తలసాని చేతిలో ఓటమిపాలైన కూన వెంకటేష్ గౌడ్ అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారడం ద్వారా ఆయనకు నామినేటెడ్ పోస్టు ఇస్తారని భావించారు. అయితే ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన కూడా పార్టీలో అంటిముట్టనట్టే ఉంటున్నారు. అంతేకాకుండా 2014లో ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిపాలైన దండె విఠల్‌ను రాజకీయంగా ఎదగనీయలేదని, ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకోవడంతో అదిలాబాద్‌కు మారాల్సి వచ్చిందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇలా కర్ణుని చావుకు కారణాలనేకమనేలా తలసాని సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టకుండా అడ్డుపడుతున్నాయనేది హాట్ టాపిక్‌గా మారింది.

రాజకీయ ప్రస్థానం..

2014లో కేసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు. 2018లో మరోమారు విజయం సాధించి అదే శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1986లో రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన మోండా డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీచేయడం ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి.పద్మారావుగౌడ్ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2008 జరిగిన ఉపఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్ చేతిలో మరోమారు ఓటమిపాలయ్యారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరి సీఎం కేసీఆర్ మంత్రిమండలిలో మంత్రిగా బాధ్యతలను చేపట్టి నాటి నుంచి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు.

Next Story

Most Viewed