సగం నోటరీలే

by Disha Web Desk 12 |
సగం నోటరీలే
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తి పన్నుకు సంబంధించి ఇటీవలే ఆస్తుల యజమానులు వారంతట వారే స్వచ్చందంగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో సుమారు 64 వేల పైచిలుకు ఆస్తులు అసెస్డ్ అయ్యాయి. కానీ వీటిలో సగానికి పైగా నోటరీ చేసుకున్న ఆస్తులే ఉండటం, పైగా సెల్ప్ అసెస్‌మెంట్‌ను అదునుగా దుర్వినియోగమైనట్లు కౌన్సిల్ సమావేశంలో తీవ్ర దుమారం రేపింది.

అంతేగాక, కొందరు అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ స్థలాలను కూడా అసెస్‌మెంట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ పలువురు కార్పొరేటర్లు ఆరోపించటంతో సెల్ప్ అసెస్‌మెంట్ కింద వచ్చిన అసెస్డ్ అయిన ఆస్తుల వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలన్న కౌన్సిల్ ఆదేశాల మేరకు అన్ని సర్కిళ్లలో ఈ ప్రక్రియ జరిగి, సుమారు 64 వేల పైచిలుకు ఆస్తులు సెల్ఫ్ అసెస్‌మెంట్లు జరిగినట్లు గుర్తించిన అధికారులు వీటిలో ఇప్పటికే 15వేల ఆస్తులకు కేటాయించిన ప్రాపర్టీ ఇండెక్స్ నెంబర్ (టిన్)లను రద్దు చేసినట్లు సమాచారం.

ఈ రకంగా నోటరీ డాక్యుమెంట్లు, చెల్లని డాక్యుమెంట్లలో మరో 20 వేల ఆస్తులు అసెస్డ్ అయిన ఆస్తులను గుర్తించిన అధికారులు వాటికి కేటాయించిన టిన్ నెంబర్లను కూడా డిలీట్ చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. అయితే సర్కారు ఆస్తుల యజమానులు తామంతట తామే స్వయంగా, పారదర్శకంగా ఆస్తులను అసెస్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే, దాన్ని దుర్వినియోగం చేయటాన్ని జీహెచ్ఎంసీ సీరియస్ తీసుకున్నట్లు సమాచారం. వీరు చెల్లించిన ట్యాక్స్‌ను తిరిగి చెల్లించాలా? లేదా? చెల్లిస్తే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై సర్కారు నుంచి క్లారిటీ తీసుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ సర్కారుకు లేఖ రాయనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed