సర్కార్ భూమి సరిపోలే..! చెరువు శిఖాన్ని సైతం చెరబట్టారు

by Disha Web Desk 1 |
సర్కార్ భూమి సరిపోలే..! చెరువు శిఖాన్ని సైతం చెరబట్టారు
X

దిశ, పటాన్‌చెరు: అమీన్ పూర్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ వేసిన విషయంలో అధికారులు కృష్ణ బృందావన్ కాలనీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.ఒక పక్క సర్వే నంబర్ 343 లో 6.18 ఎకరాల ప్రభుత్వ భూమిని మాయం చేసిన అక్రమార్కులు పక్కన ఉన్న చెరువును సైతం వదలలేదు. కృష్ణ బృందావన్ కాలనీకి అనుకుని ఉన్న బంధం కొమ్ము చెరువు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ ని ఆక్రమించి 40 కి పైగా ఇండ్లు నిర్మించి అమాయకులకు అంటగట్టి కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం ఈ అక్రమ నిర్మాణాల విషయాన్ని తేలికగా తీసుకోవడంతో ప్రభుత్వ భూమితో పాటు చెరువును సైతం మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ములో హెచ్ఎండీఏ లేక్ రికార్డుల ప్రకారం 27 ఎకరాల్లో బంధం కొమ్ము చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువుకు ఆనుకుని కృష్ణ బృందావన్ పేరుతో వెంచర్ చేసిన కాలనీ సర్వే నంబర్లలో 357, 358, 360తో పాటు పక్కన ఉన్న కాలనీలో 361, 362, 363లో సైతం ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ సంస్థ బరితెగించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిపై కాంగ్రెస్​ ప్రభుత్వం చర్యలకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

చెరువు భూమిని చెరబట్టారు..

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ము లో హెచ్ఎండీఏ లేక్ రికార్డుల ప్రకారం 27 ఎకరాలలో బంధం కొమ్ము చెరువు విస్తరించి ఉంది.ఈ చెరువుకు అనుకుని కృష్ణ బృందావన్ పేరుతో వెంచర్ చేసిన కాలనీ సర్వే నంబర్లలో 357,358,360 తో పాటు పక్కన ఉన్న కాలనిలో 361,362,363 లలో సైతం ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఒక పక్క ప్రభుత్వ భూమిలో 80 కి పైగా ఇండ్ల నిర్మాణాలు చేసిన సదరు నిర్మాణదారులు చెరువు ఎఫ్టీఎల్ లో సైతం ఈ కాలనితో పాటు పక్క కాలనిలు కలుపుకుని 40 కి పైగా నిర్మాణాలు నిర్మించినట్లు తెలుస్తుంది. చెరువు పరివాహక ప్రాంతంలో పట్టా భూములున్నప్పటికి ఎటువంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేనప్పటికీ నిబంధనలు విస్మరించి అక్రమంగా నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ ఇండ్లను సక్రమ నిర్మాణాలుగా నమ్మించి అమాయకులకు అంటగట్టి కోట్లు కొల్లగొట్టారు.

అక్రమమని కూల్చినా మళ్లీ నిర్మించారు..

కృష్ణ బృందావన్ కాలనీలో బంధం కొమ్ము చెరువును కబ్జా చేసి ఇండ్లు నిర్మిస్తున్న వ్యవహారంలో అప్పటి అధికారులు నిర్మాణాలను కూల్చి వేశారు. అయితే తమకు ఉన్న పొలిటికల్ పలుకుబడి వినియోగించి అధికారులపై ఒత్తిళ్లు తీసుకుని వచ్చి నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేసినా అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చినా కోర్టు ఆర్డర్ ఉందన్న నెపంతో అధికారులు తప్పించుకున్నారు. అయితే ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో దర్యాప్తు చేస్తున్న అధికారుల దృష్టికి చెరువులో ఇండ్ల విషయం అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం.

విచారణలో సర్కార్ దూకుడు..

ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం విచారణలో దూకుడు పెంచింది. ప్రభుత్వ భూమితో పాటు ప్రకృతి సంపద అయిన చెరువులను చెరబట్టిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిలో నిర్మాణాల విషయంలో కొనుగోలుదారులు తెలియక మోసపోయిన చెరువులో నిర్మాణాలను ఇండ్ల యజమానులు కొనుగోలు చేసిన ఘటన పట్ల అధికారులు సైతం విస్తుపోయినట్లు సమాచారం. అన్ని తెలిసి చెరువులో ఇండ్లను కొనుగోలు చేసిన వ్యవహారంపై మరింత విచారణ చేపట్టారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో అత్యాశతో ప్రభుత్వ భూమి కబ్జా చేయడంతో చెరువులో ఇండ్ల నిర్మాణాలు చేసి అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ల పని పట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.


Next Story