విద్యారంగ సమూల ప్రక్షాళనే ప్రభుత్వ లక్ష్యం

by Web Desk |
విద్యారంగ సమూల ప్రక్షాళనే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, మియాపూర్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.కోటి నలబై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 9 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమూల ప్రక్షాళనే లక్ష్యంగా ''మన ఊరు-మన బడి'' కార్యక్రమం ద్వారా రూ.7,300 కోట్లతో సర్కారు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టి, ప్రయివేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, మెరుగైన వసతులు కలిపిస్తామన్నారు. పిల్లలు చదువుకోవడానికి వీలుగా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వసుంధర, టీఆర్ఎస్ నాయకులు బీఎన్ కిరణ్ యాదవ్, గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్‌లు పాల్గొన్నారు.


Next Story