హిందువులు అణిచివేతకు గురయ్యారు

by Disha Web Desk 15 |
హిందువులు అణిచివేతకు గురయ్యారు
X

దిశ, కార్వాన్ /హిమాయత్ నగర్ : వేలాదిమంది హిందువులు కొన్ని సంవత్సరాలుగా అణిచివేతకు గురయ్యారని స్వామీ చైతన్యానంద మహారాజ్ అన్నారు. శ్రీరామనవమి పండుగ పర్వదినం సందర్భంగా భవ్య శోభాయాత్ర భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు బగవంత్ రావ్, గోవింద్ రాఠి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ స్వామీ చైతన్యానంద మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. హిందువులపై తీవ్రమైన వివక్ష కొనసాగిందని, ఎన్నో సంవత్సరాల తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయిందని తెలిపారు. తొలిసారిగా దేశవ్యాప్తంగా హిందువులు లక్షలాదిమంది రెట్టింపు ఉత్సాహంతో శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయింది అంటే దాని వెనుక వేలాది మంది హిందువులు, కరసేవకుల ఆత్మబలిధానాలు ఉన్నాయని గుర్తు చేశారు. తల్లి పాలు తాగిన ప్రతి ఒక్క హిందువులు,

సిక్కులు, జైనులు ఇప్పటికైనా నిద్ర నుండి మేల్కొని అఖండ హిందూ దేశ ఏర్పాటుకు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగింది. ధూల్‌పేట్‌ సీతారాంబాగ్‌ ప్రాంతంలోని సీతారామ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై శ్రీరామంటూ నినాదాలు చేశారు. వీధులన్నీ భక్తుల రామనామస్మరణతో మార్మోగాయి. ఈ యాత్ర హనుమాన్‌ వ్యాయామశాలలో ముగిసింది. రాజా సింగ్ హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం ఆకాష్ పురి హనుమాన్ టెంపుల్ నుండి శోభాయాత్రను ప్రారంభించి బేగం బజార్ చత్రి వద్ద ఆయన మాట్లాడారు. 2027 కల్లా భారత దేశం హిందూ దేశంగా మారుతుందన్నారు. 40 వేల దేవాలయాలు మొఘల్ సామ్రాజ్యంలో కూలగొట్టారని ఆరోపించారు.

500 సంవత్సరాలుగా మూడు దేవాలయాలు కావాలని హిందువులు కోరారని, ఒక అయోధ్య లోని రామాలయం నిర్మాణం పూర్తయితేనే హిందువులపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. హిందువులు, హిందువులు తగాదా పెట్టుకోవద్దని సూచించారు. మనలో ఐకమత్యం ఉండాలని.. మీరు చేయూత అందిస్తేనే నేను ఈ స్థానానికి వచ్చానని వ్యాఖ్యానించారు. ఈ యాత్రలో భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ భగవంతరావు, గోవింద్ రాఠీ, ప్రతినిధులు మెట్టు వైకుంఠం, నారాయణ, నరసింహ, మనోజ్ జై స్వాల్, నరేందర్, డాక్టర్ మోహన్ గుప్తా, రాజేష్, వినోద్, అశోక్, నవీన్, మురళి, అశ్విన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed