కలకోల్పోతున్న శిల్పారామం..

by Disha Web Desk 20 |
కలకోల్పోతున్న శిల్పారామం..
X

దిశ, శేరిలింగంపల్లి : వారంతాల్లో, వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి సరదాగా అలా ఏ పార్కుకో వెల్దామంటే కాంక్రీట్ జంగిల్ లా మారిన హైదరాబాద్ మహా నగరంలో సేదతీరేందుకు నిలువనీడలేని పరిస్థితి. ఉన్న కొన్ని పార్కుల్లోకూడా సరైన వసతులు లేక కునారిల్లుతున్నాయి. ఎక్కడ లేకున్నా అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా.. నిత్యం ఏదో ఓ కార్యక్రమంతో హడావుడిగా ఉండే శిల్పారామానికి వెళ్లి పిల్లలతో అలా కాసేపు గడిపి వద్దామనుకుని వెళితే అక్కడ.. బయట జరిగే ప్రచారానికి, లోపల వసతులకు ఎక్కడా సంబంధంలేదని తీవ్రఅసహనం వ్యక్తం చేస్తున్నారు సందర్శకులు. కనీసం పిల్లలు ఆడుకునేందుకు సరైన ఆటవస్తువులు కూడా లేవని మండిపడుతున్నారు.

పేరు గొప్ప...

హైటెక్ సిటీకి కూత వేటు దూరంలో ఉన్న శిల్పారామం ఎప్పుడు చూసినా రద్దీగానే ఉంటుంది. ఇక వేసవిలో పల్లెటూర్ల నుండి వచ్చే పిల్లలు, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారైనా శిల్పారామాన్ని చూడాలని అనుకుంటారు. అందుకోసం అక్కడ క్యూలో నిలబడి పెద్దలకు రూ.60, చిన్నారులకు రూ.20 పెట్టి మరీ టికెట్ కొని సరదాగా తిరిగేద్దాం అని ఎంతో ఆశతో శిల్పారామంలోకి అడుగు పెడతారు. తీరా అందులోకి ఎంటర్ అవగానే టికెట్ తీసుకునే వరకు ఉన్న ఉత్సాహం, సంతోషం క్షణాల్లో ఆవిరి అవుతుంది. అడుగడుగునా ఆంక్షలు, నో ఎంట్రీ అంటూ కట్టిన తాళ్లు దర్శనం ఇస్తాయి. కనీసం పిల్లలు కూర్చునేందుకు, ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన లాన్ లోకి కూడా ఇక్కడికి ఎవరూ రావద్దు అంటూ కట్టెపట్టుకుని తిరిగే సెక్యూరిటి హెచ్చరిస్తాడు.

మురికినీటిలోనే బోటింగ్..

శిల్పారామానికి వచ్చే సందర్శకుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అక్కడ బోటింగ్ చేయాలనుకునే వారికి ఏళ్ల నాటి బోట్లు అందుబాటులో ఉంటాయి. అది కూడా మురికినీటిలోనే బోటింగ్ చేయాల్సి ఉంటుంది. చిన్నారులు, పెద్దలు ఎవరైనా ఆ కంపు నీటిలోనే బోటింగ్ చేయాలి. అదేమీ ఊరికే కాదు అందుకు మరో రూ.30 చేతి చమురు వదిలించుకోవాలి. అక్కడి నుండి ముందుకు వెళితే కంపుకొట్టే చిన్నపాటి కొలనులో చేపలు చూస్తామని సరదా పడితే పుచ్చుపట్టిన చెక్కలు ఎప్పుడూ విరుగుతాయో, నీటిలో పడిపోతామని భయం లేకపోతేనే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త.

విరిగిన బొమ్మలు.. తిరగని వీల్స్..

పిల్లల కోసమే శిల్పారామానికి వెళ్లిన వారికి తీవ్ర నిరాశ తప్పదు. చిన్నారులు ఆడుకుంటారని ప్లే జోన్ ప్రాంతానికి వెళితే చిన్న పాటి స్థలంలో ఉన్న జారుడు బల్లలు, మూడు ఊయలలు, మూడునాలుగు వీల్స్ లలో ఒకే వీల్ పనిచేస్తుండగా, రెండు ఊయలలు మాత్రమే బాగున్నాయి. మరోటి తాడు సరిగా లేకపోవడంతో అది నిరూపయోగంగానే ఉంది. ఏళ్లనాటి జారుడు బల్లలు విరిగిపోయి దర్శనం ఇస్తున్నాయి. వందల సంఖ్యలో వచ్చే పిల్లలకు ఒకటి రెండు ఆట వస్తువులు కూడా అందుబాటులో లేక తల్లిదండ్రులతో పోరుపెడుతున్నారు పిల్లలు. ఉన్న ఆటవస్తువులు చాలా వరకు విరిగిపోయాయి.

సందర్శకులు తిరిగే చోట బీరుసీసాలు..

పెద్దలు, పిల్లలు డబ్బులు పెట్టిటికెట్ తీసుకుని లోపలికి వెళ్లి అలా ఏమేమీ ఉన్నాయా శిల్పారామం చుట్టేస్తే.. కనిపించే అందమైన ప్రదేశాలు పక్కన పెడితే చిన్నారులు తిరిగే బాటలోనే ఎక్కడికక్కడ ఖాళీ బీరు సీసాలు దర్శనమిస్తున్నాయి. అయితే సెక్యూరిటీని పెట్టి మెయిన్ గేట్ వద్ద చెక్ చేసి మరీ లోపలికి పంపే సిబ్బంది ఉండగా.. బీరు సీసాలు లోపలికి ఎలా వెళ్తున్నాయనేది శిల్పారామం ఉన్నతాధికారులకే తెలియాలి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మిన్నకుండి చూడడం పట్ల సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed