మోడీ మాయలో పడకండి

by Disha Web Desk 15 |
మోడీ మాయలో పడకండి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో / సికింద్రాబాద్ : దేవుడు గుడిలో ఉండాలని, భక్తి గుండెల్లో ఉండాలని, ప్రధాని నరేంద్ర మోదీ దేవుడిని బజారుకు తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ ల డబ్బాలలో ఓట్లు వేయించుకోవాలని చూస్తుండని, ఆ మాయలో పడకండి అని సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన ఉజ్జయిణి మహంకాళి ఆలయంలో దానం నాగేందర్ తో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ పార్టమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ లను తూర్పారబట్టారు. సికింద్రాబాద్ లో గెలిచిన పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గతంలో ఇక్కడి నుండి గెలిచిన బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి గెలిచి మంత్రి పదవులు పొందిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే బీజేపీ నుండి గెలిచిన కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రిగా ఉండి రాష్ట్రానికి విపత్తులు వచ్చిన సమయంలో ఎలాంటి సహాయం అందించలేదన్నారు. దానం నాగేందర్ ను గెలిపిస్తే కేంద్రంలో మంచి పొజీషన్ లో చూస్తారని అన్నారు. 2004 లో ఏ రకంగా సికింద్రాబాద్ గడ్డ మీద మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను ఓడించి అంజన్ కుమార్ యాదవ్ ను గెలిపించారో 20 ఏళ్ల తర్వాత సోనియమ్మ నాయకత్వంలో 2024 లో కూడా చరిత్రను పునరావృతం చేయాలని కోరారు.

మహంకాళి ఆశీర్వాదంతో సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలువబోతుందని , కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని జోష్యం చెప్పారు. దానం నాగేందర్ ఎన్నికలలో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు అన్నారు. సికింద్రాబాద్ లో గెలిపించే బాధ్యత మీది, ఢిల్లీలో పెద్ద బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని సీఎం అన్నారు. కిషన్ రెడ్డి మంత్రిగా చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ లకు తెచ్చింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 2021లో వరదలొచ్చి లోతట్టు ప్రాంతాలు మునిగి లక్షలాది కుటుంబాలు వీధిన పడితే కిషన్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోలేదని, చిల్లిగవ్వ తీసుకురాలేదని మండిపడ్డారు. ఐదేండ్లు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు, పెట్టుబడులు తేలేదని, నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్రమోడీ బెదిరించి గుజరాత్ కు తీసుకువెళ్లారని ఆరోపించారు. పీజేఆర్, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్ లు సెక్రటేరియట్ ముందు ఖాళీ కుండల ప్రదర్శన చేసి కొట్లాడితే జంటనగరాలకు కృష్ణా, గోదావరి నీళ్లు వచ్చాయన్నారు . ఓఆర్ఆర్ , ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలతో పాటు ఓల్డ్​ సిటీలో మతసామరస్యాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని రేవంత్ రెడ్డి అన్నారు. మీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా,

రూ.500 లకే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు పేదలకు రావాలన్నా, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్కై వేస్ కోసం ఆర్మీ స్థలం ఇవ్వకపోతే తాను సీఎం కాగానే ఢిల్లీకి వెళ్లి 194 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పించానన్నారు. హైదరాబాద్ విశ్వ నగరం కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ 10 ఏళ్లుగా 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా దాని జోలి చెప్పే పరిస్థితి లేదని విమర్శించారు. స్విస్ బ్యాంక్ లో లక్షల కోట్లు ఉన్నాయని,

అవి తెచ్చి మీ ఖాతాలో వేస్తానన్నాడని ఎవరికైనా వేసిండా అని సభకు హజరైన వారిని ఉద్ధేశించి అడిగారు. తెలంగాణ సమాజం మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మొన్న దేవుడి సెంట్ మెంట్ ను బయటకు తీసిండని ఎద్ధేవా చేశారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం కాపాడాలని, బీజేపీ మత చిచ్చు పెట్టి ఎన్నికలలో గెలిచేందుకు ఆలోచన చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీని ఓడగొట్టడం ద్వారా సెక్యులర్ ప్రభుత్వాన్ని తెలంగాణలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దానం నాగేందర్ ను ఎంత మెజార్టీతో గెలిపిస్తారని అక్కడికి వచ్చిన వారిని ప్రశ్నించారు. జై కాంగ్రెస్ నినాదాలు ఢిల్లీకి విన్పించాలన్నారు.

బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్టే...

సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీ మురికి కాల్వలో వేసినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ సీటును బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టుపెట్టిందని, అందుకే పద్మారావు నామినేషన్ వేస్తే కేసీఆర్, కేటీఆర్ హాజరు కాలేదన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీ లాభపడుతుందన్నారు. పద్మారావు మంచోడే కానీ ఆయన గురువు కేసీఆర్ పిట్టలదొర అని సెటైర్లు వేశారు. పద్మారావు పరువు తీయడానికే కేసీఆర్ ఆయనను సికింద్రాబాద్ బరిలోకి దించారని అన్నారు. సికింద్రాబాద్ లో పద్మారావు గెలుపునకు సహకరించకుండా బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని గెల్పించేందుకు కేసీఆర్ చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.



Next Story

Most Viewed