జలమండలిలో అవినీతి జలగలు

by Disha Web Desk 12 |
జలమండలిలో అవినీతి జలగలు
X

దిశ, శేరిలింగంపల్లి : ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నీటి సరఫరాకు అప్పుడే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటి సరఫరాకు గిరాకీ పెరిగింది. ఇదే అనువుగా ప్రైవేట్ నీటి సరఫరాదారులు ఒక్కో ట్యాంకర్‌కు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. అయినా చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు తప్పడం లేదు. అటు హెచ్‌ఎండబ్ల్యూఎస్ కూడా సరైన మోతాదులో నీటిని సరఫరా చేయలేకపోతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా నీరు సరఫరా అవడం, ఇంకొన్ని చోట్ల అరకొరగా నీటి సరఫరా జరుగుతుందని పలు కాలనీల ప్రజలు చెబుతున్నారు. నీటి సరఫరాలో వ్యత్యాసానికి అనేక కారణాలు ఉన్నాయనే చెప్పాలి. అందులో వాటర్ వర్స్క్ సిబ్బంది అలసత్వం, చేతివాటం వల్ల ఇబ్బందులు తప్పడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హఫీజ్‌పేట్ సెక్షన్ పరిధిలో అధికారుల మీద అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్కో సెక్షన్‌లో ఒక్కో రకం..

హఫీజ్‌పేట్ వాటర్ వర్స్క్ సెక్షన్‌లో చందానగర్, మియాపూర్, దీప్తిశ్రీనగర్ హఫీజ్‌పేట్, కొండాపూర్, మాదాపూర్, డోయెన్స్ కాలనీ, గచ్చిబౌలి, నలగండ్ల, రామచంద్రాపురం, పఠాన్ చెరుతో కలిపి మొత్తం 11 సెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో సబ్ డివిజన్‌కు డీజీఎంలు, ఒక్కో సెక్షన్‌కు మేనేజర్లు, వీరిపై జనరల్ మేనేజర్ ఉంటారు. అలాగే కిందిస్థాయిలో పర్మనెంట్ సిబ్బంది, తాత్కాలిక సిబ్బంది ఇలా కింద నుంచి పై స్థాయి వరకు అనేక మంది తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అయినా ఒక్కో ప్రాంతంలో పుష్కలమైన నీరు వస్తుండగా కొన్నిచోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. కిందిస్థాయి సిబ్బంది చేతివాటం వల్ల నీటి సరఫరాతో పాటు కనెక్షన్‌ల విషయంలో గోల్‌మాల్ చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

వాటర్ వర్క్స్ నిబంధనల ప్రకారం వాటర్ కనెక్షన్ లేకుండా సీవరేజ్ కనెక్షన్‌లు ఇచ్చేందుకు ఆస్కారం లేదు. కానీ హఫీజ్‌పేట్ జీఎం పరిధిలోని పలు సెక్షన్లలో అలాంటి నిబంధనలు గాలికి వదిలేసి సిబ్బంది ఇష్టారాజ్యంగా నీటి కనెక్షన్‌లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో సెక్షన్‌లో ఇల్లీగల్ నిర్మాణాల వద్ద గట్టిగా డబ్బులు వసూలు చేసి నీటి కనెక్షన్‌లను ఇస్తుండగా, ఇంకొన్ని చోట్ల పాత కనెక్షన్ ఉందని చెప్పి ఎలాంటి అనుమతులు లేకుండానే కొత్త కనెక్షన్స్ ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతీ సెక్షన్‌లోనూ సిబ్బంది చేతివాటంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తుంది.

నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్‌లు..

నల్లా నీటి కనెక్షన్ కావాలంటే వినియోగదారులు వాటర్ వర్క్స్ అధికారులు కోరిన విధంగా తమ ఇంటి పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంత స్థలంలో నిర్మాణం చేపడుతున్నారు. వాటికి ఎంత డయాతో కనెక్షన్ ఇవ్వచ్చు, ప్రధాన పైపులైన్ నుంచి ఎంత దూరం నిర్మాణ స్థలం ఉంది, అది డొమెస్టిక్ కిందకు వస్తుందా, మల్టీపర్పస్ కనెక్షన్ కిందకు వస్తుందా అనేది చూసి అందుకు తగ్గట్టుగా ఫీజు కట్టించుకుని వాటర్ వర్స్క్ సిబ్బంది కనెక్షన్ ఇస్తుంటారు. ఎవరికైనా ఇంటి ముందే కనెక్షన్స్ ఇచ్చే అవకాశం లేదు. వాటర్ పైపులైన్ లేకుండా సీవరేజ్ కనెక్షన్‌కు ఆస్కారం కూడా ఉండదు. కానీ చేతివాటంతో వాటర్ పైప్‌లైన్ లేకుండానే సీవరేజ్ కనెక్షన్ ఇచ్చిన ఘనత కూడా మన వాటర్ వర్క్స్ సిబ్బందికే దక్కుతుంది. ఒకవేళ పాత ఇంటి స్థలంలో కొత్త నిర్మాణం చేపడుతున్నా వాటికి కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే వాటర్ క్యాన్ నెంబర్ ఆధారంగానే కనెక్షన్ ఇవ్వాలి. అయినా ఈ నిబంధనలు కూడా కొంతమంది సిబ్బంది పట్టించుకోవడం లేదు.

అక్రమ కనెక్షన్‌లలో వారిదే ప్రధాన పాత్ర..

అక్రమ నల్లా కనెక్షన్‌ పొందాలంటే స్థానికంగా వాటర్‌ బోర్డు క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలు లేకుండా సాధ్యమయ్యే అవకాశం ఉండదు. అక్రమ నల్లా కనెక్షన్లకు క్షేత్రస్థాయి సిబ్బంది బాహాటంగా సహకారం అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, కిందిస్థాయి సిబ్బంది రెగ్యులర్‌‌గా ఆయా కాలనీల్లో తిరుగుతుండడంతో అక్రమ కనెక్షన్‌లను ఆదాయ వనరుగా వాడుకుంటున్నారట. ఓ ఇంటికి ఒక కనెక్షన్‌ ఉన్నా నీళ్లు సరిపోవడం లేదని వారి దృష్టికి తీసుకొస్తే అక్రమ కనెక్షన్‌ తీసుకోమని ఉచిత సలహా ఇస్తున్నారని, ఈ క్రమంలో అక్రమ కనెక్షన్‌‌దారుల నుంచి ముడుపులు కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి ముడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఓ వర్క్ ఇన్‌స్పెక్టర్ నిర్వాకం ఇటీవల జీఎం దృష్టికి వెళ్లినా ఆయన చూసీచూడనట్టు వ్యవహరించారని సమాచారం.

Next Story

Most Viewed