అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి : తెలంగాణ రైతు సంఘం

by Disha Web Desk 15 |
అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి : తెలంగాణ రైతు సంఘం
X

దిశ, ముషీరాబాద్ : అకాల వర్షాలు, వడగళ్లు, పిడుగులు పడడం వలన పెద్ద ఎత్తున పంటల నష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ కు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద రావు, కార్యదర్శి మూడ్‌ శోభన్‌ మాట్లాడారు. 5 లక్షల ఎకరాలలో రూ.1250 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా ప్రకటించిందని, కానీ వాస్తవం ఇందుకు రెట్టింపుగా ఉంటుందన్నారు. ఈ నెల 16 నుండి 20 వరకు కురిసిన వర్షాల వలన 25 జిల్లాల్లో దాదాపు 7 లక్షల ఎకరాలలో పంటల నష్టం వాటిల్లిందని తెలిపారు. పిడుగు పడి కొత్తగూడెం మండలంలో ధరంసోత్‌ శంకర్‌

మరణించారని, పెనుబల్లి మండలం బయ్యన్నపురంలో 1500 కోళ్లు మృతి చెందాయన్నారు. ఎండీఆర్ఎఫ్ స్కీమ్‌ కింద పరిహారం ఇప్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ప్రకటించారని తెలిపారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ కింద కేటాయించిన రూ.629 కోట్లు (2022-23) కూడా విడుదల చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయం కింద 2023 మార్చి 14న రూ.1816 కోట్లు విడుదల చేసిందని, కానీ అందులో తెలంగాణకు రూపాయి సహాయం కూడా ఇవ్వలేదన్నారు. 2022-23 సంవత్సరంలో వానాకాలం, యాసంగి కలిసి రూ.4,000 కోట్లు రైతులకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే సర్వే చేసి ఆహారధాన్యాలకు ఎకరాకు రూ.20 వేలు, వాణిజ్య పంటల కు ఎకరాకు రూ.40,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed