ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు సిద్ధం... పాత బంగ్లాకు పెయింటింగ్ చేసి సరికొత్తగా ముస్తాబు

by Dishanational1 |
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు సిద్ధం... పాత బంగ్లాకు పెయింటింగ్ చేసి సరికొత్తగా ముస్తాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోనూ ఒక ఆఫీసును పెట్టాలనుకుంటున్నారు. వివిధ పార్టీల నేతలతో పాటు రైతాంగ, కార్మిక, ఉద్యోగ తదితర సంఘాల ప్రతినిధులను కూడా కొత్త పార్టీలో భాగస్వాములను చేయడానికి, వారి సమస్యలను చర్చించడానికి ఒక వేదికను సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని డిప్లొమాట్ ఎవెన్యూలో కౌటిల్య మార్గ్, సర్దార్ పటేల్ మార్గ్‌ లకు సమీపంలో పెద్ద బంగళాను అద్దెకు తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ 1200 చ.మీ. స్థలాన్ని ఇవ్వడంతో అక్కడ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి అది పూర్తయ్యి అందుబాటులోకి రావడంలో ఉన్న చిక్కుల దృష్ట్యా ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకున్నది టీఆర్ఎస్ పార్టీ.

విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న బంగళా చాలాకాలంగా వినియోగంలో లేకపోవడంతో దానికి ఇప్పుడు పెయింటింగ్‌లు వేసి వీలైనంత తొందరగా అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనులు మొదలయ్యాయి. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లే పార్టీ నేతలు అక్కడి రాజకీయ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు జరిపేందుకు వీలుగా ఈ బంగళాను వినియోగించుకోనున్నది పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయించిన స్థలంలో తెలంగాణ భవన్ పేరుతో నిర్మాణం మొదలైనా వచ్చే ఏడాదికి మాత్రమే అది రెడీ కానున్నది. అప్పటివరకూ తాత్కాలికంగా ఈ బంగళానే బీఆర్ఎస్ ఆఫీసుగా మార్చుకోనున్నది. కేసీఆర్ ఈ నెల చివరి లోగా ఢిల్లీ వెళ్ళనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయానికి ఈ తాత్కాలిక భవనానికి వెళ్ళి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నది.


Next Story

Most Viewed