ఎయిర్​ గన్​తో బెదిరించిన ఇద్దరి అరెస్ట్​

by Disha Web Desk 15 |
ఎయిర్​ గన్​తో బెదిరించిన ఇద్దరి అరెస్ట్​
X

దిశ, చార్మినార్​ : పెట్రోల్​ బంక్​ సిబ్బందిని పాయింట్​ బ్లాక్​ రేంజ్​లో ఎయిర్​గన్​ పెట్టి చంపేస్తానని బెదిరించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని మీర్​చౌక్​ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి ఎయిర్​ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మీర్​చౌక్​ ఏసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్​ రావు, ఇన్​స్పెక్టర్​ రవీందర్​, ఎస్​ఐ అరుణోదయలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన రాత్రి ఏతేబర్ చౌక్ లోని హైదరాబాద్​ ఫిల్లింగ్​ స్టేషన్​ పెట్రోల్ బంకుకు పెట్రోల్​ కోసం ఆలీజాకోట్లకు చెందిన భక్షి అలీ అలియాస్​ జాహి అలియాస్​ గోల్డి(24) , మొహమ్మద్​ అర్షద్​ అలియాస్​ ఆర్షు(25) వచ్చారు. క్యూలైన్​లో రాకుండా పెట్రోల్ పోయాలని ఆ ఇద్దరు యువకులు గొడవకు దిగారు. సిబ్బంది క్యూ లైన్‌లో రావాలని పెట్రోల్ బంకు సిబ్బంది సూచించారు.

దీంతో వారు అక్కడే ఉన్న ఓ రాడ్ తీసి కొట్టడానికి యత్నించారు. సిబ్బంది పట్టుకోవడంతో ఆ ఇద్దరిలో ఒక్కరు ఎయిర్​గన్​​ తీసి పాయింట్ బ్లాక్‌లో గురిపెట్టి చంపేస్తానని బెదిరించాడు. వారిని పెట్రోల్​ బంక్​ సిబ్బంది ధైర్యం చేసి పట్టుకున్నారు. మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్తుండగా భక్షి అలీ, మొహమ్మద్​ అర్షద్​ అలీలు రెప్పపాటులో పరారయ్యారు. పెట్రోల్ బంక్ మేనేజర్ వినయ్​కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న వారిద్దరిని మీర్​చౌక్​ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్​కు తరలించారు. వారిపై ఇప్పటికే పదహారు కేసులు ఉన్నాయని, జైలు శిక్ష కూడా అనుభవించారని తెలిపారు. ఆ ఇద్దరి పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మీర్​చౌక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed