రష్యా - ఉక్రెయిన్‌ వార్‌..హైదరాబాదీ యువకుడి మృతి

by Dishanational4 |
రష్యా - ఉక్రెయిన్‌ వార్‌..హైదరాబాదీ యువకుడి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాదీ యువకుడు మహ్మద్‌ అఫ్సాన్‌ బలయ్యాడు. రష్యా తరఫున పోరాడుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లిన మహ్మద్‌ అఫ్సాన్‌ అక్కడి ఏజెన్సీ చేతిలో మోసపోయి..చివరకు బలవంతంగా అక్కడి సైన్యంలో చేరాడు. ఏ మాత్రం ట్రైనింగ్ లేకుండా అతడిని యుద్ధభూమిలోకి దింపడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అఫ్సాన్‌‌తో పాటు మొత్తం ముగ్గురు హైదరాబాదీ యువకులు ఇదే విధంగా ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయారని సమాచారం. ఇదే అంశంపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. మహ్మద్‌ అఫ్సాన్‌ మరణవార్త తమకు తెలిసిందని.. ఆ యువకుడి కుటుంబ సభ్యులు, రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు. అఫ్సాన్‌ భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 30మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించిన కొద్దిరోజుల్లోనే ఈ విషాదం చోటు చేసుకోవడం గమనార్హం. వారందరినీ తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ జనవరి నెలలోనే హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు.


Next Story