ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు.. అందులో తప్పక జత చేయాల్సింది ఇదే!

by Disha Web Desk 2 |
ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు.. అందులో తప్పక జత చేయాల్సింది ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆరు గ్యారంటీలను హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని అమలు చేయడానికి మొదటి అడుగు వేస్తున్నది. ఈ నెల 28 నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగే గ్రామ సభల్లో అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలూ కవర్ అయ్యేలా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజా పాలన ప్రోగ్రామ్ గురించి వివరించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసిన తర్వాత ఆరు గ్యారంటీల్లో దేని కింద అర్హత లభిస్తుందో అధికారులు తేల్చనున్నారు. యువ వికాసం మినహా మిగిలిన గ్యారంటీలకు అర్హత ఉన్నవారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను వినియోగిస్తున్నది.

అన్ని గ్యారంటీలకూ ఒకే అప్లికేషన్ :

ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వాలనుకుంటున్న ఐదు గ్యారంటీలకు ఒకే అప్లికేషన్‌ను తీసుకోనున్నది. దరఖాస్తుదారుల వివరాలను అందులో భర్తీ చేస్తున్నందున వాటిని ప్రామాణికంగా తీసుకుని ఇందులో ఏ గ్యారంటీ స్కీమ్ కింద అర్హత లభిస్తుందో అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత ఖరారు చేయనున్నారు. ప్రతీ గ్యారంటీకి నిర్దిష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనున్నది. అవి వచ్చిన తర్వాత వాటికి అనుగుణంగా దరఖాస్తుల విశ్లేషణ, పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ కానున్నది.

వైట్ రేషన్ కార్డే ప్రామాణికం :

ప్రస్తుతం ఈ ఐదు గ్యారంటీలకు వైట్ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల్లో దీనితో పాటు ఆధార్ కార్డు వివరాలను కూడా పొందపర్చాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కంప్యూటరైజ్ చేసిన తర్వాత పరిశీలన సమయంలో ఏ గ్యారంటీ కింద ఏ దరఖాస్తుదారు ఫిట్ అవుతారో క్లారిటీ రానున్నది.

వైట్ రేషన్ కార్డు లేకుంటే :

వైట్ రేషన్ కార్డు నెంబర్‌ను విధిగా దరఖాస్తు ఫారంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కార్డు లేకపోయినా దరఖాస్తును సమర్పించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. స్క్రూటినీ సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.

ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందా?

ఐదు గ్యారంటీల లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలను నిర్దిష్టమైన మార్గదర్శకాల రూపంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి వర్తిస్తాయా లేవా అనేది త్వరలో స్పష్టత రానున్నది. దరఖాస్తు చేయడానికి మాత్రం ఆంక్షలు ఉండవు.

టాక్స్ పేయర్లు అర్హులేనా? :

ప్రభుత్వ పేదలకు మాత్రమే సంక్షేమాన్ని అందించాలని భావిస్తున్నది. అట్టడగున ఉన్నవారికి, చివరి వరుసలోని నిరుపేదలకు ప్రభుత్వం సాయం చేయాలని నొక్కిచెప్పినందున ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారికి గ్యారంటీలను అమలు చేయడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. మార్గదర్శకాల్లో వీటి గురించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్నది.

వైట్ రేషన్ కార్డు ఉన్నా :

గతంలో వైట్ రేషను కార్డు పొందినా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే గ్యారంటీలు పొందడానికి అర్హత ఉంటుందా?.. అనే సందేహం వెంటాడుతున్నది. అప్పటి నిబంధనల ప్రకారం వైట్ రేషను కార్డు పొందినా ఇప్పుడు టాక్స్ పేయర్ అయినందున గ్యారంటీలు పొందడానికి అర్హతపైనా మార్గదర్శకాల్లో వివరణ రానున్నది.

కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి :

గతంలో వైట్ రేషన్ కార్డు లేనందున కొత్తగా పొందడానికి దరఖాస్తు చేసుకున్నవారికి ఏడేండ్లుగా అందలేదు. ఇలాంటివారు ఇప్పుడు గ్యారంటీలు పొందడానికి ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోడానికి చిక్కులేమీ లేవు. కానీ వైట్ రేషను కార్డు లేనందున అర్హత లభిస్తుందా లేదా అనేది గైడ్ లైన్స్ రిలీజ్ అయిన తర్వాత స్పష్టం కానున్నది.

ప్రస్తుత లబ్ధిదారులూ అప్లై చేసుకోవాలా? :

ప్రస్తుతం ఆసరా పింఛన్, రైతుబంధు తదితర పథకాల ఫలాలు అందుకుంటున్నవారు ప్రజాపాలనలో భాగంగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా అనే సందేహానికి ప్రభుత్వం నుంచి ఇంకా వివరణ రాలేదు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల్లో లబ్ధిదారుల వివరాలు ఉన్నందున మరోసారి అప్లై చేసుకోవడంపై పంచాయతీరాజ్ అధికారులు నివృత్తి చేయాల్సి ఉన్నది.

గడువు ముగిసిన తర్వాత అప్లై చేసుకోవచ్చా?

ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు గ్రామాల్లోకి వచ్చే అధికారులు గ్రామ సభ నిర్వహించే సమయంల ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. గడువు తీరిపోయిన తర్వాత కూడా దరఖాస్తులను తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినందున వాటిని ఎవరికి, ఎక్కడ సమర్పించాలనేది కూడా స్పష్టమైన ప్రకటన రూపంలో ప్రభుత్వం తెలియజేయాల్సి ఉన్నది.

ఆధార్ కార్డు లేనట్లయితే :

ప్రతీ దరఖాస్తులో వైట్ రేషను కార్డు, ఆధార్ కార్డు నెంబర్లను పొందుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి రెండూ లేకపోయినా దరఖాస్తును సమర్పించడానికి ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఆధార్ కోసం ఇప్పటికే అప్లై చేసుకుని ఉంటే దాని రిఫరెన్సు నెంబర్‌ను సైతం పొందుపర్చవచ్చు.

డిపార్టమెంట్ల మధ్య సమన్వయం :

ప్రభుత్వం తక్షణం ఇవ్వాలనుకుంటున్న ఐదు గ్యారంటీలకు అర్హత పొందడానికి ఉమ్మడి దరఖాస్తునే ప్రజలకు అందిస్తున్నది. అందులోని వివరాల ఆధారంగా ఏ గ్యారంటీకి అర్హత లభిస్తుందో అధికారులు డిసైడ్ చేస్తారు. ఈ గ్యారంటీల్లో గ్రామీణాభివృద్ధి (పంచాయతీరాజ్), హౌజింగ్, వ్యవసాయం, విద్యుత్, ఆర్టీసీ, పౌర సరఫరాలు తదితర డిపార్టుమెంట్లు ఉన్నందున సాఫ్ట్ వేర్ ద్వారా వీటిని ఆయా విభాగాలకు పంపించడం, అర్హతను డిసైడ్ చేయడం కీలకంగా మారింది.



Next Story

Most Viewed