షర్మిల వ్యాఖ్యలపై భగ్గుమన్న హిజ్రాలు.. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్

by Disha Web Desk 19 |
షర్మిల వ్యాఖ్యలపై భగ్గుమన్న హిజ్రాలు.. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తక్షణమే తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, మహబూబాబాద్ పాదయాత్రలో వైఎస్ షర్మిల శంకర్ నాయక్‌ను కొజ్జా అంటూ ఘాటుగా విమర్శించారు. 'ఎవడ్రా కొజ్జా.. హామీలు అమలు చేయని నువ్వు కదా కొజ్జా' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ చెయ్యని మిమ్మల్ని కొజ్జాలు కాకుంటే మరేమంటారు అంటూ ప్రశ్నించారు.

ఆరు నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమవుతారు అంటూ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వరంగల్‌లోని హిజ్రాలు షర్మిల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిజ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె బహిరంగ క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు. షర్మిల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన హిజ్రాలు.. వరంగల్ హెడ్పోస్ట్ ఆఫీస్ జంక్షన్‌లో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఆపై షర్మిల ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు.

ఇక ఈ నిరసన కార్యక్రమంతో స్థానికంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు, హిజ్రాలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, హిజ్రాలలో చదువుకున్న వారు, విద్యావంతులు, మేధావులు ఎందరో ఉన్నారని, హిజ్రాలు నేడు సమాజంలో మిగతా కమ్యూనిటీలలానే గౌరవప్రదంగా జీవిస్తున్నారని హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా పేర్కొన్నారు. హిజ్రాల గురించి మాట్లాడేటప్పుడు వారి జీవితం ఏంటో వారితో కలిసి ఉండి తెలుసుకోవాలని, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ కొజ్జా, కొజ్జా అంటూ తమ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడితే ఊరుకునేది లేదని..ఖబడ్దార్ షర్మిల అంటూ హిజ్రాలు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed