సెక్రటేరియట్‌లో లేడీ ఐఏఎస్‌కు వేధింపులు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

by Disha Web Desk 19 |
సెక్రటేరియట్‌లో లేడీ ఐఏఎస్‌కు వేధింపులు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా ఆఫీసర్లను వేధిస్తున్న ఉన్నతాధికారులపై ఇంటెలిజెన్స్‌ నిఘా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. సెక్రటేరియట్ నుంచి జిల్లా స్థాయి వరకు పుల్ ఫోకస్ పెట్టారు. ప్రత్యేక టీమ్‌‌లు ఇలాంటి తప్పిదాలను గుర్తించి, సీఎంవోకు చేరవేసేందుకు రెడీ అయ్యాయి. ప్రధానంగా సీనియర్ ఐఏఎస్‌లతో పాటు జిల్లా స్థాయిలోని కీలక అధికారులపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఇటీవల సెక్రటేరియట్‌లో ఓ మహిళా ఐఏఎస్‌ని ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి వేధించినట్లు ఉద్యోగుల్లో ప్రచారం జరిగింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎంవో, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరి కొంత మంది అధికారులు కూడా ఇలాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వానికి అనుమానాలున్నాయి.

దీంతో అలాంటి అధికారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది. భవిష్యత్‌లో ఇలాంటివి రిపీట్ కావొద్దని సూచించిన సీఎం, వెంటనే నిఘా పెట్టాలని ఆదేశాలిచ్చినట్లు సచివాలయ ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. సచివాలయంతో పాటు కమిషనరేట్లు, జిల్లాల్లోనూ మహిళా ఆఫీసర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం నొక్కి చెప్పారు. మహిళా ఆఫీసర్లను వేధిస్తున్న పై అధికారులను గుర్తించి సీఎంవోకి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఓ నేత తెలిపారు.

వర్క్ అంటూనే..?

ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్‌ను స్వయంగా తన సీనియర్ అధికారే వేధించారనే వార్త ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నది. ముఖ్యంగా సెక్రటేరియట్ ఉద్యోగుల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నది. వర్క్, సబ్జెక్ట్ డిస్కషన్స్ అంటూ పిలిచి కొందరు అధికారులు పర్సనల్ వ్యవహారం నడిపించేందుకు చొరవ తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. హాలిడే రోజుల్లోనూ కొందరు అధికారులు ఇంపార్టెంట్ ఫైల్స్, వర్క్ అంటూ ఆఫీసులకు రావాలని ఆదేశిస్తూ, మహిళా ఆఫీసర్లతో చనువుగా ఉండేలా మాట్లాడుతున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.

హోదాను, ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కొంత మంది మహిళా ఆఫీసర్లు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. పైగా పై అధికారులే టార్చర్ పెట్టడంపై మహిళా ఆఫీసర్లు నోరు మెదిపే పరిస్థితి కనిపించడం లేదనే చర్చ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి తప్పిదాలను వెలికితీయాలని సీరియస్‌గా ఆదేశాలిచ్చినట్లు ఉద్యోగ సంఘాల్లో ఇంటర్నల్‌గా చర్చ జరుగుతున్నది.

పొగడ్తలతో పులిహోరలు..?

‘‘నీ డ్రెస్ బాగుంది. నీ కండ్లు బాగున్నాయి. సండే ఖాళీగా ఉంటావా..? పెళ్లై పిల్లలున్నా బ్యూటీ తగ్గలేదు, నిన్ను చూస్తుంటే కాలేజీల్లో నా గర్ల్ ఫ్రెండ్ గుర్తుకువస్తుంది” తదితర మాటలతో కొందరు సీనియర్ ఐఏఎస్‌లు మహిళా ఉద్యోగులను వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో చాంబర్లకు వెళ్లాలంటే కూడా కొందరు మహిళా ఉద్యోగులు భయాందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. బాస్‌లు కావడంతో ఫ్యామిలీతోనూ షేర్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఇలా చాలా మంది మహిళా ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నట్లు సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి.

ప్రభుత్వ పెద్దలు అవాక్కు..?

సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండే ఐఏఎస్‌ల చిలిపి చేష్టలపై ప్రభుత్వ పెద్దలు అవాక్కు అవుతున్నారు. గతంలో శంకరన్ లాంటి సీనియర్ ఐఏఎస్‌ల పనితీరును గుర్తుచేసుకున్న ప్రభుత్వ పెద్దలు, ప్రస్తుత కొందరు ఐఏఎస్‌లు చేస్తున్న చేష్టలు చూసి నాలుక కర్చుకుంటున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ మీటింగ్‌లోనూ ఈ అంశంపై కొందరు మహిళా ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. వర్క్ అంటూ చాంబర్లకు పిలిచి, సబ్జెక్టు డిస్కషన్స్ అంటూ కార్లలో తిప్పుతూ పర్సనల్‌గా మాట్లాడుతున్నారని ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల వేధింపుల్లో పెళ్లికాని మహిళా అధికారులు కూడా ఉండటం గమనార్హం. ఉన్నతాధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడటంపై ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో కొందరు మహిళా అధికారులు సతమతమవుతున్నట్లు తెలిసింది.


Next Story