సిరిసిల్ల కాంగ్రెస్‌లో అనిశ్చితి.. టికెట్‌ కోసం నలుగురు పోటీ?

by Disha Web Desk 2 |
సిరిసిల్ల కాంగ్రెస్‌లో అనిశ్చితి.. టికెట్‌ కోసం నలుగురు పోటీ?
X

దిశ, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. గ్రూపు రాజకీయాలు, నాయకత్వ లోపాలు సిరిసిల్ల కాంగ్రెస్‌ను పట్టి పీడిస్తున్నాయి. ప్రజా సమస్యలపై స్పందించకపోగా.. వారి గ్రూపు రాజకీయాలతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ను నాయకత్వ లోపంతో కాంగ్రెస్‌ను రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయేలా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేతల కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు అయోమయంలో పడిపోతున్నారు. ఏ లీడర్ దిక్కు ఉండాలో కార్యకర్తకు తోచక.. సైలెంట్‌గా ఉండిపోతున్నారు. సిరిసిల్లలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ, నాయకత్వ లోపంతో రెండో స్థానంలో నుంచి బీజేపీ, బీఎస్పీ పార్టీల తర్వాతకు పడిపోతుంది.

కేకే మహేందర్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకర్

రాజన్న సిరిసిల్ల రాజకీయాల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో సిరిసిల్లలో పొన్నం తన వర్గీయులకు పార్టీ పదవులు, ఇతర ప్రాధాన్యతలు ఇస్తూ వస్తుంటారు. కేటీఆర్‌పై స్వల్ప మేజార్టీతో ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి పొన్నంకు కేకేకు మధ్య దూరం మరింత పెరిగిపోయింది. కేకే మహేందర్ రెడ్డి తన వర్గంతో అడపా దడపా కార్యక్రమాలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. పొన్నం వర్గీయులైన సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారయణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌లు కేకే మహేందర్రెడ్డికి వ్యతిరేకంగా తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సమావేశాలకు కూడా కేకే మహేందర్ రెడ్డికి ఆహ్వానం ఇవ్వకుండా తమ వర్గీయులతోనే కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. పొన్నం ప్రభాకర్ పాదయాత్రకు కూడా కేకే మహేందర్ రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడతో ఈ పాదయాత్రకు కేకే మహేందర్ రెడ్డికి దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలు, వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కేకే మహేందర్ రెడ్డి, పొన్నం వర్గ విబేధాలతో సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ పంచాయతీ

సిరిసిల ఎమ్మెల్యే టికెట్ ఈసారి సిరిసిల్ల పట్టణ నేతలకే ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులు నాగుల సత్యనారయణ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పట్టుపడుతున్నారు. నాలుగుసార్లు ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని.. ఈసారి తప్పకుండా మాకే ఇవ్వాలని నాగుల సత్యనారయణ, సంగీతం శ్రీనివాస్ పేర్కొంటుండగా ఎల్లారెడ్డిపేటకు మండలానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ నేత తనకు కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుపడుతున్నాడు. కేకే మహేందర్ రెడ్డి తీరును సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు సంగీతం శ్రీనివాస్ బహిరంగగానే రాజకీయ విమర్శలు చేయడం పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈసారి సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్ పద్మశాలి సామాజిక వర్గానికి ఇవ్వాలని లేకపోతే నాగుల సత్యనారయణకు ఇచ్చిన ఓకే అంటూ సంగీతం శ్రీనివాస్ ప్రకటించడం చర్చనీయాంశం అవుతుంది.

కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం.. అనిశ్చితిలో క్యాడర్

సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. డీసీసీ అధ్యక్షులుగా నాగులు సత్యనారయణగౌడ్ పదవి చేపట్టి నాలుగేళ్లు అవుతున్న పార్టీలో క్యాడర్లో జోష్ నింపలేకపోయాడు. తూతూ మంత్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వ తప్పిదాలను నిలదీయడంలో, ప్రజా సమస్యలపై స్పందించడంలో విఫలయ్యారన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తమవున్నాయి. కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పట్టణ కాంగ్రెస్ నాయకులను కలుపుకోకుండా కేకే మహేందర్ రెడ్డి ఏకపక్షంగా వెళ్తున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం తన వర్గీయులతోనే అప్పుడప్పుడు ప్రెస్మీట్లు నిర్వహిస్తూ.. కార్యక్రమాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడన్న విమర్శలు వినవస్తున్నాయి. కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గంలో కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే సందర్శిస్తాడని టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో సైటైర్లు వేస్తూ వస్తున్నారు. పార్టీలో అందరినీ కలుపుకుపోయే నాయకుడు లేక.. నాయకత్వ లోపంతో సిరిసిల్ల కాంగ్రెస్ వెనుకపడిపోతుంది. కనీసం ప్రజా సమస్యలపై ధీటైనా కార్యక్రమాలు చేయడంలోనే కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైందని సిరిసిల్లలో చర్చకొనసాగుతుంది. కేవలం తంగళ్లపల్లి, ఎల్లారెడ్డి మండలాలు మినహా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలో అనిశ్చితి నెలకొంది. గ్రూపు రాజకీయాల మధ్య కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ లీడర్ను ఎన్నుకోవాలో.. ఎటువైపు ఉండి పని చేయాలో కాంగ్రెస్ క్యాడర్లో ఓ ప్రశ్న తలెత్తుతుంది.

సిరిసిల్లలో ప్రధాన ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఎస్పీ

సిరిసిల్లలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ, బీఎస్పీ పార్టీలు ఎదుగుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ..పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక సిరిసిల్లను రెండు సార్లు సందర్శించారు. బీఎస్పీ క్యాడర్ సైతం బలంగా తయారవుతోంది. నాయకత్వ లోపంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలతో పోల్చుకుంటూ మూడవ స్థానానిక దిగజారిపోతుందన్న వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం సిరిసిల్లపై దృష్టి సారించాలని, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటోంది.


Next Story