48 గంటల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలి: RS ప్రవీణ్ కుమార్ డిమాండ్

by Disha Web Desk 19 |
BSP Chief RS Praveen Kumar Says An acre of land for the poor if we are empowered
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను 48 గంటల్లో రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రియురాలి కోసం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను టీఎస్పీఎస్సీ ఉద్యోగి ఫణంగా పెట్టాడని ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్‌కి గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో 150కి 103 మార్కులు ఎట్లొస్తయి? అని ఆయన ప్రశ్నించారు.

ఎంతో మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని వాళ్ల పిల్లల్ని చదివిస్తుంటే టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరు చాలా బాధకరమని ఆర్ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ సిబ్బందికి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్‌కి అక్రమ యాక్సెస్ ఉందని చైర్మన్ బహిరంగంగా చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ కాలేదన్న నమ్మకం ఏంటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

చైర్మన్‌కు తప్ప మరెవరికి తెలియని పాస్వర్డ్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు ఎలా తెలిసిందో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కారుణ్య నియామాకాల్లో అపాయింట్ అయిన ప్రవీణ్ అనే వ్యక్తి.. తన ప్రియురాలి కోసం కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తీసుకున్నారంటే శోచనీయమన్నారు. చైర్మన్‌గా జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన పరీక్షలన్ని రద్దు చేయాలని, జనార్దన్ రెడ్డిని చైర్మన్ పదవి నుండి తొలగించి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed