మెట్రో సెకండ్ ఫేజ్‌కు గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 7 |
మెట్రో సెకండ్ ఫేజ్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రోకారిడార్‌ను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డిసెంబర్ 9 న సీఎం కేసీఆర్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. రానున్న మూడు సంవత్సరాలల్లో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్నది. ఈ మెట్రో.. బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ, నార్సింగి, టీఎస్ పోలీసు అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎయిర్ పోర్టు కార్గో స్టేషన్, టెర్మినల్ వంటి కొన్ని స్టేషన్లు షెడ్యూల్ చేశారు.

విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా మెట్రో రైలు నడుస్తుంది. మొత్తం 31 కిలో మీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టును రూ. 6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. ఈ పొడవులో దాదాపు 2.5 కిలో మీటర్ల ప్రాజెక్టును హైదరాబాద్ ఎయిర్ పోర్ట మెట్రో రైల్(హెచ్ఏఎంఎల్) పర్యవేక్షిస్తుంది.ఈ మార్గం వెంట పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మరో ఐదు కిలోమీటర్ల మెట్రో నిర్మాణంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

20 నిమిషాల్లో విమానాశ్రయం చేరుకునేలా...

హైదరాబాద్ నగర భవిష్యత్తు రవాణా అవసరాలను తీర్చిదిద్దుతూ, నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి 20 నిమిషాల్లోనే 31 కిలోమీటర్లు అతి తక్కువ సమయంలో చేరుకునేలా మెట్రో ప్రాజెక్టుని రూపకల్పన చేశారు. ప్రపంచంలోని ప్రముఖ మెట్రో నగరాలన్నింటిలోనూ కూడా ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో వున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణలతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో మెట్రోను విమానాశ్రయం వరకు అనుసంధానించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మెట్రో ప్రాజెక్ట్ తో మరిన్ని పెట్టుబడులకు హైదరాబాద్ గమ్య స్థానంగా మారబోతున్నది. హైదరాబాద్ లో పెరుగుతున్న రద్దీని తట్టుకునే ఉద్దేశంతో, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రవాణా మౌలిక వసతులను కల్పిస్తున్నది. అనేక ప్రాజెక్టులను, ఫ్లై ఓవర్లను, లింక్ రోడ్లను, ఇతర రహదారి వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది.

కేటీఆర్ ప్రకటన చేసిన రెండ్రోజుల్లోనే...

ఈ నెల25న గచ్చిబౌలిలోని శిల్పాలేఅవుట్‌ నుంచి నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్.. మెట్రో రైలు విస్తరణపై ప్రకటన చేశారు. మెట్రో రైలు రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వారు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా తప్పకుండా రెండో దశను పూర్తి చేస్తామన్నారు. మాదాపూర్‌ మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్లు మొత్తం కలిపి 63 కిలోమీటర్లు మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 5 కిలోమీటర్లు, మైండ్‌స్పేస్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు 32 కిలోమీటర్లు కొత్తగా మెట్రో నిర్మిస్తాం అని ప్రకటించారు. కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన రెండ్రోజుల్లోనే సీఎం స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాఫిక్.

రెండో అతిపెద్ద మెట్రోగా గుర్తింపు...

హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రోగా ఇప్పటికే గుర్తింపుపొందింది. మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్, ఎల్ బీ నగర్ -అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018 లో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019 న ప్రారంభించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం 2020 ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గం ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కి.మీ.లకు గాను 69 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది.

ఈ నెల 14న కేంద్రానికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఫేజ్ టూ, ఫేజ్ వన్ కారిడార్ నెంబర్ 3(నాగోల్ -ఎల్బీనగర్) విస్తరణకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్ మధ్య 26 కిలోమీటర్ల (23 స్టేషన్లతో) ఎల్బీనగర్ – నాగోల్ మధ్య (4 స్టేషన్లతో కూడిన 5 కిలోమీటర్ల మేర ) మెట్రోను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఫేజ్ 1 లో 69 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రోకు అదనంగా మరో 31 కిలోమీటర్లకు విస్తరించాలనుకుంటున్నట్లు తెలిపారు. బీహెచ్ఈఎల్ – లక్డీకాపుల్, నాగోల్ –ఎల్బీనగర్ కారిడార్ నిర్మాణానికి 8453 కోట్ల రూపాయలవుతుందని, దీని నిర్మాణాన్ని భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన 8453 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం ఇచ్చి వచ్చే బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు.

బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ మెట్రో

బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు కొత్త మెట్రో రైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. దీనికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను, అనుబంధ డాక్యుమెంట్లను అక్టోబరు 27న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పటికే నగరంలో తిరుగుతున్న మూడు లైన్ల (కారిడార్లు)కు అదనంగా మరో మూడు లైన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎయిర్‌పోర్టు మెట్రో లైన్‌ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమ స్వంత నిధులతో నిర్మించుకోవాలని భావిస్తున్నది. మిగిలిన రెండు లైన్లను మాత్రం పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నది.

బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మొత్తం 26 కి.మీ. మేర లైన్ నిర్మాణానికి సుమారు రూ. 8,453 కోట్లు ఖర్చు కానున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. రానున్న కేంద్ర బడ్జెట్‌లో దీనికి అవసరమైన నిధులను కేటాయించాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరికి ఇటీవల రాసిన లేఖలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మార్గం బీహెచ్ఈఎల్ నుంచి మదీనాగూడ, కొండాపూర్, హైటెక్ సిటీ జంక్షన్, రాయదుర్గం, మెహిదీపట్నం, టోలీచౌకీ, మసాబ్‌టాంక్‌ల మీదుగా లక్డీకాపూల్‌ను కలపనున్నది. మొత్తం 23 స్టేషన్లు ఉంటాయి.

* ఇక ఎల్బీనగర్-నాగోల్ మధ్య 5 కి.మీ. మేర విస్తరణ పనులకు కూడా కేంద్రం నిధులు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ఈ రెండు స్టేషన్ల మధ్య నాలుగు కొత్త స్టేషన్లు ఉనికిలోకి వస్తాయి.

* హైదరాబాద్ మెట్రో మూడు ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లు మూడు వేర్వేరు మార్గాలను కలుపుతున్నాయి.

* రెడ్ లైన్ - ఎంజీ బస్ స్టేషన్, నాంపల్లి మరియు అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు...

* గ్రీన్ లైన్ - జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుండి సికింద్రాబాద్ మీదుగా ఎంజీ బస్ స్టేషన్ వరకు

* బ్లూ లిన్ ఇ - సికింద్రాబాద్ మరియు అమీర్‌పేట్ మీదుగా నాగోల్ నుండి రాయదుర్గ్ వరకు

మూడు ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లు...

* అమీర్‌పేట్ మెట్రో రైలు ఇంటర్‌చేంజ్ స్టేషన్ : ఈ ఇంటర్‌చేంజ్ స్టేషన్ రెడ్ లైన్ మరియు బ్లూ లైన్‌లో ప్రయాణించే ప్రయాణీకులకు సహాయం

* పరేడ్ గ్రౌండ్స్ మెట్రో రైలు ఇంటర్‌చేంజ్ స్టేషన్ : ఈ ఇంటర్‌చేంజ్ స్టేషన్ గ్రీన్ లైన్ మరియు బ్లూ మధ్య పరివర్తనలో ప్రయాణీకులకు సహాయం

* ఎంజీబీఎస్ మెట్రో రైలు ఇంటర్‌చేంజ్ స్టేషన్ : రెడ్ లైన్ మరియు గ్రీన్ లైన్‌లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఈ ఇంటర్‌చేంజ్ స్టేషన్

హైదరాబాద్ మెట్రో మార్గంలో వివరంగా...

రెడ్ లైన్: హైదరాబాద్ మెట్రో యొక్క రెడ్ లైన్ వాయువ్యం నుండి ఆగ్నేయానికి నగరం యొక్క గుండె గుండా ప్రయాణిస్తుంది. ఇది మియాపూర్ మరియు LB నగర్ మధ్య 27 స్టేషన్లతో 29 కిలోమీటర్ల పొడవు ఉంది. రైలులో మూడు క్యారేజీలు ఉన్నాయి, గరిష్టంగా 80 కి.మీ/గం వేగంతో ప్రయాణిస్తుంది మరియు ప్రతి 4 నుండి 10 నిమిషాలకు ఆగుతుంది.(మియాపూర్, జేఎన్ టీయూకళాశాల, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, భరత్‌నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్ర మంజిల్, ఖైరతాబాద్, లక్డీ కా పుల్, అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఎంజీ బస్ స్టేషన్, మలక్ పేట, కొత్త మార్కెట్, ముసారాంబాగ్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్, ఎన్బీ నగర్)

గ్రీన్ లైన్ : హైదరాబాద్ మెట్రో గ్రీన్ లైన్ హైదరాబాద్ మెట్రో రైల్ (HMR)చే నిర్వహించబడుతుంది మరియు అన్ని క్రియాశీల హైదరాబాద్ మెట్రో స్టేషన్ల నుండి 9 స్టాప్‌లను కలిగి ఉంటుంది. 2019 చివరి నుండి, ఈ మార్గం పూర్తిగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. JBS నుండి MGBS వరకు 9.66-km మార్గం మరియు MGBS నుండి ఫలక్‌నుమా వరకు 5.36-km మార్గంతో సహా ఇది రెండు దశల్లో ప్రణాళిక చేయబడింది.(జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీ బస్ స్టేషన్)

బ్లూ లైన్ : బ్లూ లైన్ హైదరాబాద్ మెట్రో రైలు ద్వారా నిర్వహించబడుతుంది మరియు అన్ని క్రియాశీల హైదరాబాద్ మెట్రో స్టేషన్ల (HMR) నుండి రాయదుర్గ్ నుండి సికింద్రాబాద్ తూర్పు వరకు 23 స్టాప్‌లను కలిగి ఉంటుంది. ప్రతి రైలులో మూడు క్యారేజీలు ఉంటాయి మరియు రైళ్ల మధ్య 5 నుండి 10 నిమిషాల వరకు 80 కి.మీ/గం గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చు.( నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్ జీఆర్ఐ,

హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ తూర్పు, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, రసూల్‌పురా, ప్రకాష్ నగర్, బేగంపేట, అమీర్‌పేట, మధురా నగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీ హిల్స్ రోడ్ నెం 5, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, రాయదుర్గ్)

Next Story

Most Viewed