ప్రత్యేక అధికారుల పాలనలో మూలనపడిన పారిశుద్ధ్యం..

by Aamani |
ప్రత్యేక అధికారుల పాలనలో మూలనపడిన  పారిశుద్ధ్యం..
X

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ని పలు వార్డులలో ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్య పనులు పడకేసిందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సీతారాం బజార్ కాలనీ లో రోడ్డు పై చెత్తా చెదారంతో నిండి డ్రైనేజీ మయంగా తయారయ్యిందని సాయంత్రం పూట అధిక దోమలతో చిన్నపిల్లలు కు విష జ్వరాలు వస్తున్నాయని అంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంటి ముందు ఉండాలంటే దుర్వాసన వెదజల్లడంతో ముక్కున వేలు వేసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సీతారాం బజార్ లోని డ్రైనేజీ క్లీన్ చేయక దాదాపు నెల రోజులు అవుతున్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గ్రామంలోని అన్ని డ్రైనేజీలు నిండి చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయని ఎన్నోసార్లు కార్యదర్శికి ఫిర్యాదు చేసిన ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మురుగును ఆవాసంగా చేసుకొని విష సర్పాలు ఎన్నో ఇండ్లకు వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని దానికి తోడు దోమల బెడద ఎక్కువై మా కాలనీలో రోగాల బారిన పడుతున్నామని ఉన్నత అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులు లేకపోవడంతో స్పెషల్ అధికారి పాలన నియమించడంతో ఏనాడు కూడా స్పెషల్ అధికారి మా వీధులలో వచ్చిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేసి రోగాల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పలుమార్లు అధికారులకు విన్నవించిన తుంగలో తొక్కి పట్టపగలే వీధి దీపాలను వెలిగిస్తున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed