మైనార్టీలకు సర్కార్ షాక్.. రూ. లక్ష ఆర్థిక సహయం ఎంపికలో బిగ్ ట్విస్ట్..!

by Disha Web Desk 19 |
మైనార్టీలకు సర్కార్ షాక్.. రూ. లక్ష ఆర్థిక సహయం ఎంపికలో బిగ్ ట్విస్ట్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించే స్కీమ్‌ను ఈ ఏడాది పరిమిత స్థాయిలోనే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అర్హులైన కుటుంబాలన్నింటికీ ఇస్తామని చెబుతున్నా.. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో కేవలం 27 వేల మందికి మాత్రమే వర్తింపజేయాలనుకుంటున్నట్లు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు.

ఆర్థిక వనరులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ ఏడాది ఈ స్కీమ్ కోసం రూ.270 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ తయారు చేసినట్లు తెలిసింది. ఆ మేరకు మాత్రమే లబ్ధిదారులకు సాయం అందించి, మిగిలినవారికి దశలవారీగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కంటిన్యూ చేయనున్నది.

ఇప్పటికే రెండున్నర లక్షల దరఖాస్తులు

ఈ స్కీమ్ అమల్లోకి రాకముందే మరో పథకం ద్వారా ముస్లిం మైనార్టీల నుంచి రుణాల కోసం సుమారు రెండున్నర లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. వాటినే ఈ స్కీమ్‌కు లింక్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన క్రిస్టియన్ల దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 14 వరకు కంటిన్యూ కానున్నది.

గడువు ముగిసిన తర్వాత ఈ అప్లికేషన్లన్నింటినీ స్క్రూట్నీ చేసి, తర్వాత గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉన్నవాటిని ఫిల్టర్ చేసి అర్హత కలిగినవారి జాబితాను అధికారులు ఫైనల్ చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముగిసిన తర్వాత సెప్టెంబరులో ఈ స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభం కానున్నది. క్రిస్టియన్ల కోసం సుమారు రూ. 30 కోట్లను కేటాయించే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం. వచ్చే సంవత్సరం నుంచి దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా నిధులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది.

పెండింగ్‌లోనే బీసీలకు సాయం

చేతివృత్తులకు చేయూత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకల సందర్భంగా బీసీ స్కీమ్‌ను ప్రారంభించింది. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ టౌన్‌లో ఈ నెల 15న 15 మంది లబ్ధిదారులకు చెక్కులను సైతం పంపిణీ చేశారు. అన్ని జిల్లాల్లో ఇది లాంఛనంగా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అనధికారికంగా వాయిదా పడింది.

నిధుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ బీసీ లబ్ధిదారులకు సాయం అందలేదు. ఇదే టైమ్‌లో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు కూడా ఇదే తరహా స్కీమ్‌ను ప్రవేశపెట్టడంతో ఆర్థిక వనరులను సమకూర్చడం ప్రభుత్వానికి కష్టంగా మారింది. ఎన్నికల షెడ్యూలు రిలీజ్ అయ్యే నాటికి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చి ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని..

కర్ణాటక రిజల్ట్స్ తర్వాత ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నారన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించకపోతే ఆ వర్గాల్లో విశ్వాసాన్ని నెలకొల్పలేమనే ఉద్దేశంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులను ఆదేశించనున్నది.

దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రే ఈ స్కీమ్‌ను లాంచ్ చేసే అవకాశమున్నది. మైనార్టీల్లో అర్హత కలిగిన కుటుంబాలన్నింటికీ ఈ స్కీమ్ ద్వారా సాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఆర్థిక వనరుల సమస్యల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అందించాలనుకుంటున్నది. ఈ దిశగానే ఆర్థిక శాఖలో కసరత్తు జరుగుతున్నది.

నిధుల్లేక..

సెకండ్ టర్ములో ముఖ్యమంత్రి అనేక పథకాలు ప్రారంభించినా, చాలా స్కీమ్స్ అర్ధాంతరంగానే నిలిచిపోయాయి. అనేక హామీలు అమలుకే నోచుకోలేదు. ఆయా సెక్షన్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని వాటికి కూడా కొంత నిధులను సమకూర్చి ఈ సంవత్సరం కొద్దిమందికైనా లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు.

కొత్త స్కీమ్‌లను కూడా మొదలుపెట్టి దశలవారీగా సంపూర్ణంగా అమలు చేయాలనుకుంటున్నారు. అనేక హామీలకు నిధులను సమకూర్చాల్సి ఉన్నందున అన్నింటా పరిమిత సంఖ్యలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి నమ్మకాన్ని పొందాలనుకుంటున్నారు. రైతుబంధు లాంటి కొన్ని పథకాలను పక్కన పెట్టడం వీలుకానందున మిగిలిన స్కీమ్‌లకు మాత్రం వివిధ రూపాల్లో కోత పెట్టాలని భావిస్తున్నారు..



Next Story

Most Viewed