TS: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయ్

by Disha Web Desk 2 |
TS: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: చాలా నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా 1వ తేదీ సెలవు దినం కావడంతో 2వ తేదీ ఉదయం 10 గంటలలోపే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో శాలరీలు పడడం వారి మధ్య హాట్ టాపిక్‌గా మారింది. చాలాకాలం తర్వాత సకాలంలో జీతాలు పడ్డాయని సంతోషపడ్డారు. కొన్ని డిపార్టుమెంట్ల, జిల్లాల్లోని ఉద్యోగులకు రెండో తేదీన పడకపోవడంతో రానున్న రెండు మూడు రోజుల్లో పేమెంట్లు జరుగుతాయని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ వెళ్ళింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఠంఛన్‌గా ఫస్ట్ తారీఖునే జీతాలు పడే ఆనవాయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ మధ్యలో పడుతుండడంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చితి నెలకొన్నది.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువదీరిన తర్వాత మొదటి నెలలోనే శాలరీలు రెండో తేదీన జమ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఒరవడి ఇకపైన కూడా ఇలాగే కొనసాగితే ఈఎంఐ పేమెంట్లకు ఇబ్బంది ఉండదని, బ్యాంకులకు సమాధానం చెప్పుకుని బతిమాలుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయం సచివాలయంలోని శాఖాధిపతులు, కార్యదర్శుల వరకూ చేరింది. వచ్చే నెల నుంచి ఫస్ట్ తారీఖునే శాలరీలు బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యేలా చూస్తామని, ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిందని మౌఖికంగా ఉద్యోగులకు వివరణ ఇచ్చారు.

ఈ నెల రెండో తేదీన శాలరీలు జమకాని ఉద్గుల విషయంలో ప్రతీరోజూ డిపాజిట్ చేసే ప్రాసెస్ జరుగుతుందని, ఎటటి పరిస్థితుల్లో 5వ తేదీకల్లా జీతాల పేమెంట్లు కంప్లీట్ చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు వివరణ ఇచ్చారు. వచ్చే నెల నుంచి ఫస్ట్ తారీఖునే జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగిందని, ఒకటి రెండు నెలలు ఇంప్లిమెంట్ కాకున్నా కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌లో (ఏప్రిల్ నుంచి) తప్పనిసరిగా ఒకటే తేదీనే ఉద్యోగులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని సచివాలయ అధికారులు భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చినట్లుగానే శాలరీలను ఐదో తేదీలోపే జమ చేస్తుండడంతో ప్రభుత్వంమీద నమ్మకం పెరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నా, గత ప్రభుత్వ తీరుతో దయనీయంగా మారినా ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరించడం ఎంప్లాయీస్ మధ్య చర్చకు దారితీసింది.



Next Story

Most Viewed