GHMC నగరవాసులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ఇకపై దానికి కూడా డబ్బు కట్టాల్సిందే..?

by Disha Web Desk 19 |
GHMC నగరవాసులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ఇకపై దానికి కూడా డబ్బు కట్టాల్సిందే..?
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మహానగరవాసులపై మరో ఆర్థికభారం మోపేందుకు సిద్దమైంది. ఇప్పటికే కరోనా తర్వాత ఆగమాగమైన నగరవాసులపై ఏటా రూ.216 కోట్ల ఆర్థిక భారాన్ని మోపేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్దం చేయటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన ఎనిమిదేళ్ల నుంచి మహానగరాన్ని గ్యార్బెజ్ ప్రీ సిటీగా మార్చేందుకు నగరంలోని చెత్త కుండీలను ఎత్తేసిన జీహెచ్ఎంసీ డోర్ టూ డోర్ చెత్త కలెక్షన్ కోసం ప్రజాధనంతో దశల వారీగా సుమారు 5250 స్వచ్చ టిప్పర్ ఆటోలను సమకూర్చింది.

ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు జీతాల్లేని కార్మికులను నియమించి, వారికి చెత్త అప్పగించాలని సూచించింది. దీంతో జీహెచ్ఎంసీ తమ డోర్ స్టెప్ వరకు సేవలను విస్తరించిందని నగరవాసులు భావించారు. కానీ అసలు స్కెచ్ ఇప్పుడు బయటపడటంతో మహానగరవాసులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. బస్తీలు, మురికివాడల్లో అయితే ప్రతిఇంటి నుంచి చెత్తను సేకరించే కార్మికుడికి చెత్తతో పాటు నెలకు మీకు తోచినంత ఇవ్వాలని, దీనిపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పుకొచ్చిన బల్దియా, ఇప్పుడు ఈ చెత్త ఛార్జీలను తప్పనిసరి చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ ఖజానాకు ఎలాంటి లాభం లేకపోయినా, ఇప్పుడీ ఛార్జీల వడ్డనను ఎందుకు తెరపైకి తెచ్చిందో అంతుచిక్కని విషయంగా మారింది. కానీ బస్తీలు, మురికివాడల్లో కేవలం రూ.50 కదా అన్ని చెల్లించేవారెక్కువ మందే ఉన్నా, కాలనీల్లో నివసించే విద్యావంతులు మాత్రం తామెందుకు నెలసరి ఛార్జీలు చెల్లించాలంటూ ఇప్పటికే కార్మికులతో గొడవలకు దిగుతున్న ఘటనలు జరుగుతుండగా, ఈ చార్జీలు మస్ట్‌గా చెల్లించాలన్న నిబంధన అమల్లోకి వస్తే మరెన్ని గొడవలు జరుగుతాయో? వేచి చూడాలి.

అదనపు భారమే

మహానగరంలోని కాలనీలు, బస్తీలు, మురికివాడల్లోని ఒక్కో ఇంటి నుంచి చెత్తను ఇవ్వటంతో పాటు కాలనీలో నైతే రూ.వంద, బస్తీల్లోనైతే రూ.50 చెల్లించాలన్న నిబంధనను త్వరలోనే జీహెచ్ఎంసీ తప్పనిసరి చేయటం ఒక రకంగా నగరవాసులపై అదనపు భారం మోపటమేనన్న వాదనలున్నాయి. ఇప్పటికే ఆస్తి పన్ను, ఇళ్లు నిర్మించుకునే పర్మిషన్ కోసం ఛార్జీలు, ఇక ఇంటికి చిన్న టులెట్ బోర్డు పెట్టుకుంటే వేలల్లో జరిమానాలు చెల్లిస్తున్న నగరవాసులు ఇక చెత్తపై పన్ను కూడా చెల్లించాలన్న నిబంధన త్వరలోనే తెరపైకి రానుంది.

గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మహానగరంలో మొత్తం 22 లక్షల గృహాలున్నట్లు వెల్లడైంది. ఈ సర్వే నిర్వహించి ఎనిమిదేళ్లు గడిచాయి. దీంతో నగరంలో అదనంగా ఓ 20 శాతం గృహాలు పెరిగి ఉన్నా, మొత్తం గృహాల సంఖ్య 24 లక్షలకు చేరనుంది. సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.75 చెల్లించినా, నెలకు రూ.18 కోట్లు, అలాగే సంవత్సరానికి 216 కోట్ల భారం జనంపై పడుతుంది.

రేపే స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదన

చెత్తపై అదనపు ఛార్జీలను వసూలు చేయాలన్న ప్రతిపాదనను శుక్రవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అధికార బీఆర్ఎస్ పార్టీ, దాని మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీలకు చెందిన సభ్యులే ఈ కమిటీలో ఉండటంతో ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారా? ప్రజలపై ఆర్థికభారం మోపే ఈ ప్రతిపాదనకు మజ్లిస్ అంగీకరిస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మున్ముందు మరో నిబంధన

ప్రస్తుతం ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తూ నామినల్ ఛార్జీలు వసూలు చేస్తుండగా, దాన్ని అధికారికంగా తప్పనిసరి చేసేందుకు సిద్దమైన జీహెచ్ఎంసీ మున్ముందు మరో నిబంధనను అమల్లోకి తేవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇంట్లో పోగయ్యే చెత్తను తడి, పొడిగా చెత్తగా వేర్వేరు చేసి ఇస్తేనే తీసుకోవాలని కార్మికులకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. కలిపి ఇచ్చే వారి చెత్త తీసుకోకుండా వారి ఇంటి వద్దే వదిలేయాలని సూచించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇదే జరిగితే అధికారులు చేయాలనుకున్న గ్యార్బెజ్ ఫ్రీ సిటీగా కాకుండా ఇళ్ల బయట, గల్లీగల్లీలో మళ్లీ చెత్త కుప్పలు దర్శనమిస్తూ గ్యార్బెజ్ ఫుల్ సిటీగా మారే అవకాశముంది. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో కార్మికులకు, స్థానికులకు మధ్య గొడవలు జరిగే అవకాశాల్లేకపోలేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలన్నీ అధికారులకు ముందే తెలిసినా కేవలం ఆటో టిప్పర్లను కొనుగోలు చేస్తే వచ్చే కమీషన్ల కోసమే ఇంత ప్లాన్ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



Next Story

Most Viewed