రేవంత్‌ రెడ్డి ఓయూకి వస్తే తన్ని తరుముతాం: గెల్లు శ్రీనివాస్ వార్నింగ్

by Disha Web Desk 19 |
రేవంత్‌ రెడ్డి ఓయూకి వస్తే తన్ని తరుముతాం: గెల్లు శ్రీనివాస్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు పెట్టే కనీస అర్హత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేదని, ఓయూకి వస్తే తన్ని తరుముతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీకేజీపై ప్రభుత్వం మీద నిరారోపణమైన ఆరోపణలు రేవంత్ రెడ్డి చేయడం దుర్మార్గమన్నారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు.

పేపర్ లీకేజీలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని, అందుకే సిట్ విచారణ జరగకుండా నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో కోర్టులో కేసు వేయించాడని ఆరోపించారు. లీకేజీపై కనీస అవగాహన లేకుండా బండి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, వారు నిజాలను తప్పించేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

మంత్రి కేటీఆర్‌పై, ప్రభుత్వంపై ఆరోపణ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో పేపర్లు లీకేజీలు అయితే అక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి గానీ రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో పేపర్ లీక్ అయినప్పుడు అక్కడి మంత్రులు, సీఎంలు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు.

రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, బీజేపీకి వంతపాడుతూ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు లోపాయిరికాగా ములఖత్ అయినవి ఆరోపించారు. టీఎస్పీఎస్సీపై ఆధారాలు లేకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే పీసీసీ అధ్యక్షుడికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీకి ఏజెంట్గా రేవంత్ పని చేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో మందల భాస్కర్, వీరబాబు, తొట్ల స్వామి, తుంగ బాలు. కడారి స్వామి, కిరణ్ గౌడ్, వివిధ సంఘాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.


Next Story