‘మేం మొరపెట్టుకున్నా సర్కారు పట్టించుకోలేదు’

by Disha Web Desk 2 |
‘మేం మొరపెట్టుకున్నా సర్కారు పట్టించుకోలేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతిని అరికట్టేందుకు సమాచార హక్కుచట్టం పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం కమిషనర్ల నియామకం చేపట్టాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు కమిషనర్ల నియామకంపై లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత సమాచార కమిషన్, కమిషనర్ల నియామకం జరగాల్సి ఉన్నా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నియామకం చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో పిల్ వేశామన్నారు.

కోర్టు ఆదేశాలతో 2017లో రాష్ట్రంలో కమిషన్ ఏర్పాటు చేసిందని, చీఫ్ సమాచార కమిషనర్ 2020లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఖాళీగానే ఉందన్నారు. ఈ నెల 24వ తేదీతో కమిషనర్ల పదవీకాలం పూర్తి అవుతుందని తెలిసినా ప్రిపరేషన్ మొదలు పెట్టలేదన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం సర్చి కమిటీని నియమించి సెలక్టు లిస్టు తయారు చేయాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. ఇప్పటికైనా చొరవ తీసుకొని నియామకం చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed