ఫస్ట్ డే@48.. రాష్ట్రంలో మొదలైన నామినేషన్ల సందడి

by Disha Web Desk 4 |
ఫస్ట్ డే@48.. రాష్ట్రంలో మొదలైన నామినేషన్ల సందడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. గురువారం మొదటి రోజున మొత్తంగా 48 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు పలు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం దాఖలు చేశారు. పలు చోట్ల నామినేషన్ ప్రోగ్రామ్స్‌కు అభ్యర్థులు భారీగా జన సమీకరణ చేశారు. ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ తరఫున మల్కాజిగిరిలో ఈటల రాజేందర్, ఆయన భార్య జమున, మహబూబ్‌నగర్ స్థానానికి డీకే అరుణ, నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి భరత్, మెదక్ స్థానానికి రఘునందన్‌రావ్, నల్లగొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ నుంచి నాగర్‌కర్నూల్ సెగ్మెంట్‌లో డాక్టర్ మల్లు రవి, జహీరాబాద్‌లో సురేష్ షెట్కర్, మెదక్‌లో నీలం మధు ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరితో పాటు పలువురు బీజేపీ నేతలు అటెండ్ అయ్యారు. ప్రధాన పార్టీలతో పాటు పిరమిడ్ పార్టీ, ప్రజావాణి పార్టీ, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ, సోషలిస్టు పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ, విద్యార్థుల రాజకీయ పార్టీ, అలయెన్స్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీలకు చెందిన వారు, స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు

నామినేషన్ల దాఖలు కార్యక్రమాన్ని అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ స్థాయిలో జన సమీకరణతో పాటు ర్యాలీలు, రోడ్‌షో వంటి కార్యక్రమాలను జోడిస్తున్నారు. మొదటి రోజునే బలప్రదర్శన తరహాలో ప్రోగ్రామ్స్ నిర్వహించడం ద్వారా ప్రచారం సమయంలో ప్రజల దృష్టిలో పడతామనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు.

నేడు పలు చోట్ల సీఎం రేవంత్ హాజరు

మహబూబ్‌నగర్, మహబూబాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, బలరాం నాయక్ నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసేంతవరకూ సీఎం రేవంత్ పలు పార్లమెంటు సెగ్మెంట్లలో అటెండ్ హాజరయ్యేలా పార్టీ షెడ్యూల్ రూపొందించింది.

మంచి రోజు ఉందనే..

నామినేషన్లు దాఖలు చేయడానికి వారం రోజుల సమయం ఉన్నప్పటికీ మంచి ముహూర్తాలు, శుభదినాలు కావడంతో ఫస్ట్ రోజునే చాలా మంది నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 21న సైతం మంచి ముహూర్తం ఉన్నందున మరికొందరు ఆ రోజున దాఖలు చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు అవకాశం

నామినేషన్ల పర్వానికి ముందే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సకల ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే సర్క్యులర్ ద్వారా వివరించింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా నామినేషన్‌ దాఖలు చేసే డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినా పెద్దగా స్పందన రాలేదు. ఈసారీ ఆ అవకాశాన్ని కొనసాగిస్తున్నట్లు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని దాన్ని సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈ నెల 24లోగా సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నందున ఫొటోల దగ్గరి నుంచి అఫిడవిట్ వరకు సరిగా చెక్ చేసుకోవాలని, పొరపాట్లు ఉన్నాయో లేవో తనిఖీ చేయడానికి అధికారులు ఉండనందున ఇది తప్పనిసరి అని వివరించారు.

బోణికాని కంటోన్మెంట్ స్థానం

లోక్‌సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికీ ఉప ఎన్నిక జరగనున్నది. ఆ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయడం గురువారమే ప్రారంభమైంది. కానీ తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ స్థానంలో మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. స్వతంత్ర అభ్యర్థి మొదలు ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు.

Next Story

Most Viewed