తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు.. సంగతి తేల్చనున్న హైకోర్టు

by Disha Web Desk 2 |
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు.. సంగతి తేల్చనున్న హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా అలాట్ అయినా తెలంగాణలోనే దీర్ఘకాలంగా కొనసాగుతున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాదాలను తేల్చేయాలని హైకోర్టు భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తరఫున డీవోపీటీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు డిసెంబరు 4 నుంచి విచారణ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం 13 మంది అధికారులు ఏపీకి అలాట్ అయినా తెలంగాణలోనే కొనసాగుతున్నారని, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని దాదాపు పదేండ్లుగా పనిచేస్తున్నారని ఆ పిటిషన్‌లో డీవోపీటీ ఆరోపించింది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అనిల్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.

ఇరు తరపున వాదనలు జరిగాయి. ఏపీ కేడర్‌గా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆ రాష్ట్రానికి బదిలీ చేయాల్సిందేనని, గతంలోనే సోమేశ్ కుమార్‌ బదిలీపై హైకోర్టు ఉత్తర్వులను వెలువరించిందని, మిగిలినవారి విషయంలోనూ ఇదే తరహా సారూప్యత ఉన్నందున వీరికి కూడా అవే ఉత్తర్వులను వర్తింపజేయాలని డీవోపీటీ తరఫు న్యాయవాది వాదించారు. కానీ సోమేశ్ కుమార్ విషయంలో వెలువరించిన తీర్పు తమకు వర్తించదని అధికారుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా హైకోర్టు బెంచ్ సైతం కొన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్నదని, అఖిల భారత సర్వీసు అధికారులను (ఏఐఎస్) ఏపీకి కేటాయించి అంతే కాలమైందని వ్యాఖ్యానించారు. పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ అధికారులు డీవోపీటీకి వారి విజ్ఞప్తి, అభ్యంతరాలు, ఆభ్యర్థలను చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 13 మంది అధికారుల్లో పలువురు రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నారని వారి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. చివరకు ఒక్కో అధికారి తరఫున వ్యక్తిగతంగా వాదనలను వినిపించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు బెంచ్.. విచారణ ప్రక్రియను డిసెంబర్ 4 నుంచి మొదలుపెట్టనున్నట్లు పేర్కొని అప్పటికి విచారణను వాయిదా వేసింది.

ఏపీ కేడర్‌ అలాట్‌మెంట్ జరిగినా తెలంగాణలో కొనసాగుతున్న అధికారులు :

హరికిరణ్, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, శివశంకర్ లోహటి, గుమ్మల సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాణీప్రసాద్, డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న అమ్రపాలి, ఐపీఎస్ ఆఫీసర్లు డీజీపీ అంజనీ కుమార్, అభిలాష్ భీష్ట్, అభిషేక్ మొహంతి. తెలంగాణ కేడర్‌గా కేటాయింపు జరిపినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న శంషేర్‌సింగ్ రావత్, అనంతరాము కూడా క్యాట్ ఉత్తర్వులపైనే అక్కడ కొనసాగుతున్నారు. వీరి బదిలీ వ్యవహారం కూడా డిసెంబరు 4 నుంచి ప్రారంభం కానున్నది.


Next Story