దిగ్విజయ్ సింగ్ నివేదికపై ఉత్కంఠ.. పంతం నెగ్గించుకునేలా సీనియర్ల, రేవంత్ రెడ్డి పట్టు

by Disha Web Desk |
దిగ్విజయ్ సింగ్ నివేదికపై ఉత్కంఠ.. పంతం నెగ్గించుకునేలా సీనియర్ల, రేవంత్ రెడ్డి పట్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై దిగ్విజయ్​నివేదిక కోసం సీనియర్లు వెయిట్​చేస్తున్నారు. పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న దిగ్విజయ్.. ఏఐసీసీకి నివేదిక ఇస్తామని చెప్పి వెళ్లారు. నేతలను స్థానికంగానే హెచ్చరించి, సైలెంట్​చేయాలని డిగ్గీ రాజా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రేవంత్‌ను సీనియర్లు మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో స్థానికంగా రాజీయత్నాలు సఫలం కాలేదు. దీంతో ఏఐసీసీకి నివేదిక ఇస్తామని, అప్పటి వరకు సైలెంట్‌గా ఉండాలంటూ రాష్ట్ర నేతలకు చెప్పి వెళ్లారు. ప్రస్తుతం నేడో, రేపో ఏఐసీసీ, సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

నివేదిక బయటకు వచ్చాకే..?

ప్రస్తుతానిక తిరుగుబాటు నేతలు మౌనంగా ఉంటున్నారు. విమర్శలు, వ్యతిరేక ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. దిగ్విజయ్​సింగ్​రాష్ట్రానికి వచ్చి, నేతలతో మాట్లాడినప్పటికీ సీనియర్ల కొంత అసంతృప్తిగానే ఉంటున్నారు. ఇదే సమయంలో సీనియర్లకు కూడా సున్నితంగా వార్నింగ్​ ఇవ్వడం కొంత అందోళనకరంగా మారింది. కానీ, తమ పట్టు సాధించుకునేందుకు అధిష్టానం ముందు తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తిరుగుబాటు నేతలు మూకుమ్మడిగా సమావేశాలు కాకున్నా.. జరుగుతున్న పరిణామాలపై నిత్యం గ్రూపుగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్​ నివేదిక పూర్తిస్థాయిలో బయటకు వచ్చేంత వరకు సంయమనంగా ఉండాలని భావిస్తున్నారు. దిగ్విజయ్​ నివేదికలో సీనియర్ల తిరుగుబాటును ఎలా చూపించారో స్పష్టత రావాలని వెయిట్ చేస్తున్నారు. రేవంత్​ రెడ్డిని సీనియర్లకు అనుకూలంగా ఎలా చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు రేవంత్​కూడా సీనియర్లను కలుపుకునే అంశంలో పట్టు మీదే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కాలంలో ఈ రెండు వర్గాలు ఎవరికి వారుగానే ఉంటే మళ్లీ పార్టీకి నష్టం జరుగుతుందని అటు ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్​ నివేదికలో ఏముందో కొంత ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల వరకు టీపీసీసీ, సీనియర్లను సమన్వయం చేసే విధంగా ఏఐసీసీ తరుపున ప్రత్యేక కమిటీ వేయాలని దిగ్విజయ్​ సూచించినట్లుగా సీనియర్లకు హస్తిన నుంచి సమాచారం అందినట్లుగా చెప్తున్నారు. ఒకవేళ ఏఐసీసీ నేతలతో కమిటీ వేస్తే.. ఏఐసీసీలోని రాష్ట్ర నేతలకు బాధ్యతలు ఇస్తారా.. లేదంటే ఢిల్లీ లేదా ఇతర రాష్ట్రాల నేతలకు బాధ్యతలిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నేతలకు బాధ్యతలిస్తే మళ్లీ పాత కథే ముందుకు పడుతుందనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​మాణిక్కం ఠాగూర్‌‌తో సమస్య సాగుతూనే ఉంది. కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలంగా ఉంటున్నారని, సీనియర్లను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నేతలకు ఇక్కడి బాధ్యతలను ఇస్తే.. వారు కూడా టీపీసీసీ నిర్ణయాలను కీలకంగా తీసుకునే అవకాశం ఉంటుందని, సీనియర్లకు మళ్లీ కష్టమే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, టీపీసీసీకి సమాంతరంగా వర్కింగ్​కమిటీని రాష్ట్రంలోనూ నియమించాలనే డిమాండ్​ కూడా సీనియర్ల బృందం ఏఐసీసీ ముందుకు తీసుకు వస్తోంది.

ఢిల్లీకి వెళ్దాం

సీనియర్లు, రేవంత్​ వర్గీయులు ఎవరికి వారే ఢిల్లీకి రావద్దంటూ దిగ్విజయ్​సింగ్​సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ, సీనియర్​నేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలను కలిసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఒక సీనియర్​నేత ఢిల్లికి వెళ్లి వచ్చిన తర్వాత మరొకరు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో ఏఐసీసీలో ఏం జరుగుతుందో తెలుస్తుందని, అక్కడి సమాచారాన్ని అంచనా వేసుకుని ప్రతి వ్యూహం వేయాలనుకుంటున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.అంతేకాకుండా రాహుల్​ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఇదే సాకుగా అటు జోడో యాత్రలో పాల్గొనే విధంగా వెళ్లి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం రాష్ట్రానికి చెందిన ఇష్యూలపైనే కాకుండా జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి ఉండాలని, అదే సమయంలో ఏఐసీసీ నేతలను కలిసి రావాలని వ్యూహాలు వేస్తున్నారు.

Next Story

Most Viewed