బీజేపీలో చేరికపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ

by Disha Web Desk 19 |
బీజేపీలో చేరికపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇప్పటికే లాయర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బీజేపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తన జన్మదినం సందర్భంగా అయోధ్య వెళ్లి రాముడ్ని దర్శించుకుంటే బీజేపీలో చేరినట్లేనా..? అని ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నుంచి అనేక మందిని డబ్బులు, పదవులు, భయపెట్టి కాంగ్రెస్‌, బీజేపీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారడంపై కొందరు కోడి గుడ్డు మీద కొందరు ఈకలు పీకుతున్నారని విమర్శించారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ అంటే బహుజనుల రాష్ట్ర సమితి అన్నారు. బహుజనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వాటన్నింటిని తిరస్కరించి కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. బీఆర్‌ఎస్‌ బహుజనుల పార్టీ గనుకే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రలోభాలకు లొంగకుండా పార్టీలో చేరారన్నారు. బీఆర్‌ఎస్‌లో బహుజన నాయకత్వం బలంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ బహుజన నాయకులను లోబరుచుకునే ప్రయత్నం కాంగ్రెస్‌ పార్టీ చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ కుట్రలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు. అంబేడ్కర్‌ సిద్ధాంతాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని తెలిపారు. కొందరు పార్టీ నుంచి లాభం పొంది ఇతర పార్టీలలోకి వెళ్తున్నారని మండిపడ్డారు.

ఉద్యమంలో ద్రోహం చేసిన వాళ్లే మళ్లీ ఇప్పుడు ద్రోహం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను టార్గెట్‌ చేయడంలో భాగంగానే కవిత అరెస్టు జరిగిందని అన్నారు. కవిత అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోందని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అని, కచ్చితంగా మరో సారి పెద్ద పోరాటం మొదలవుతుందని, పాలన పారదర్శకంగా ఉండాలని, అందరినీ కలుపుకొని పోవాలన్నారు. మరో పోరాటానికి పాలకులు ఆజ్యం పోయకూడదన్నారు. తమది ఉద్యమ కుటుంబం అని, తనపై పదేళ్లుగా దుష్ప్రచారం జరుగుతూనే ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఓపిగ్గా ధైర్యంగా ఉండాలి.. ఎవరూ తొందర పడొద్దని పిలుపు నిచ్చారు.

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వానికి విచారణల మీద ఉన్న శ్రద్ద పథకాల అమలులో లేదన్నారు. రేవంత్ వాడుతున్న భాషకు ఆయనపై క్రిమినల్ కేసు పెట్టి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటకు నీళ్లివ్వడం ఈ సీఎంకు చేతనవడం లేదని, దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ కేసీఆర్ కన్నా మంచి పాలన చేసి చూపాలన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళుతున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. బీఆర్ఎస్‌లో నాయకులకు కొదవ లేదు.. ఎంత మంది వెళ్లినా నష్టం లేదన్నారు.


Next Story

Most Viewed