పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఈటల రాజేందర్ క్లారిటీ.. నియోజకవర్గం అదేనా?

by Disha Web Desk 2 |
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఈటల రాజేందర్ క్లారిటీ.. నియోజకవర్గం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ఎన్నికల ప్రచార రథాల పూజా కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం ప్రచార రథాలను కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజల ఆదరణ కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యం కానీ హామీలు గుప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు వన్ సైడ్‌ ఉంటాయని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మోడీవైపే ఉన్నారని చెప్పారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే అది మోడీ నాయకత్వంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

గత పదేళ్ల పాలన చూస్తే ఈ విషయం అందరికీ తెలుస్తుందని వెల్లడించారు. ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని సెగ్మెంట్లలో సత్తా చాటుతామని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు కేటాయిస్తుందని అన్నారు. తప్పకుండా తాను కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటానని.. ఈ విషయాన్ని గత రెండు నెలలుగా చెబుతూనే ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అనే ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కాంగ్రెస్ ఈ తరహా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు.. మల్కాజిగిరి లేదా జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఈటల బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Next Story

Most Viewed