బ్రేకింగ్: ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఈసీ భేటీ

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఈసీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణతో పాటు మొత్తం ఐదు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ తుది వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఇవాళ ఢిల్లీలో ఎన్నికల అబ్జర్వర్లతో భేటీ అయింది తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఛత్తీస్ గఢ్ లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 10-15 మధ్య ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసే యోచనలో ఈసీ ఉన్నట్లు సమాచారం.

తుది దశకు వచ్చిన తేదీల ఖరారు:

ఎన్నికల నిర్వాహణకు సంబంధించి రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించి ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, భద్రతా అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు నిర్వహించింది. ఇక ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారు చేయడమే ఫైనల్ గా మారింది. దీంతో ఇవాళ్టి అబ్జర్వర్ల భేటీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కీలకం కాబోతున్నదనే టాక్ వినిపిస్తోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మిజోరం అసెంబ్లీకి గడువు ఈ డిసెంబర్ 17తో ముగుస్తుడగా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ అసెంబ్లీల కాలపరిమితి వచ్చే ఏడాది జనవరి వరకు ఉంది. దీంతో ఐదు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తారా లేక నవబంర్- డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయా అనేది ఇవాళ జరగబోయే మీటింగ్ లో ఓ నిర్ణయానికి రాబోతున్నదని తెలుస్తోంది.

షెడ్యూల్ పై పార్టీల దృష్టి:

తెలంగాణలో రాజకీయ పార్టీల దృష్టి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ పైనే ఉంది. బీఆర్ఎస్, బీఎస్పీ మినహా మిగతా పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల చేయలేదు. ముందుగా ప్రకటిస్తే అసంతృప్తుల పోరు ఉంటుందనే వ్యూహంలో భాగంగానే షెడ్యూల్ వచ్చాక అభ్యర్థులను ప్రకటించాలనే ప్రణాళికతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో సైతం అసంతృప్తుల తిరుగుబాటు రోజురోజుకు పెరుగుతుండటంతో షెడ్యూల్ వస్తే అంతా సెటిల్ అవుతుందనే అభిప్రాయాలతో అన్ని పార్టీలు కసరత్తు చేసుకుంటున్నాయి.

Next Story

Most Viewed