ఆ దొంగలను తరిమికొట్టండి.. సొంత పార్టీ నేతలను కడిగిపారేసిన బీఆర్ఎస్ నాయకుడు

by Disha Web Desk 13 |
ఆ దొంగలను తరిమికొట్టండి.. సొంత పార్టీ నేతలను కడిగిపారేసిన బీఆర్ఎస్ నాయకుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఖమ్మం బీఆర్ఎస్ లో విభేదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఉద్యమకారుడు, ఆ పార్టీ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ఖమ్మం జిల్లాలో గురువారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువరు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొమ్మెర రామ్మూర్తి తనను స్టేజీపైకి ఆహ్వానించకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడైన తనను స్టేజీపైకి రాకుండా అవమానపరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామ్మూర్తిని పైకి రావాలని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కోరగా నేను వారి కాళ్లు మొక్కాలా అంటూ రామ్మూర్తి ఫైర్ అయ్యారు. అనంతరం ఆయన్ను స్టేజీపైకి తీసుకువెళ్లగా అక్కడి నుంచి మాట్లాడిన బొమ్మెర.. పార్టీలో ఉద్యమకారుడిని అవమానిస్తూ జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సొంత పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆ దొంగలను తరిమికొట్టండి:

ఉద్యమకారులను అవమానపరుస్తున్న దొంగలను తరిమికొట్టాలని, పార్టీలో పని చేసే వారికి న్యాయం జరగాలన్నారు. పార్టీ నేతలంతా ఒక్కతాటిపై ఉండాలని, గ్రూప్ రాజకీయాలు, దొంగ చాటు రాజకీయాలు మానుకోవాలన్నారు. బొమ్మెర రామ్మూర్తి అనే వ్యక్తి తప్పు చేస్తే ఉరితీయాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను పార్టీ కోసం ప్రాణం పెట్టే తనను ఎందుకింత అవమాన పరచడం అని కడిగిపారేశారు. చాతకాని దద్దమ్మలకు ఇంకో ఛాన్స్ ఇవ్వొద్దన్నారు. జిల్లాలో పార్టీ ఓడిపోవడానికి కారణం మనమే అని అందరం ఏకం కావాలన్నారు. బొమ్మెర రామ్మూర్తి అనే వాడు ఏపార్టీకి కొమ్ముకాయడని నామా నాగేశ్వర్ రావును గెలిపించుకోవాలన్నారు. మాట్లాడే దమ్ములేని వారు, పని చేయచేతకాని వారంతా మాట్లాడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నామా నాగేశ్వర్ రావు గెలుపు కోసం తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది సీట్లకు గాను బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఈ క్రమంలో ఎంపీ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ లో తాజాగా బొమ్మెర రామ్మూర్తి వ్యాఖ్యలు దుమారంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పెద్దల తీరుపై ఇన్నాళ్లు లోలోపలే రగిలిపోయిన నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు పార్లమెంట్​ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న రివ్యూ మీటింగులను వేదికగా చేసుకొని తమ మనసులోని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరును ఎక్కడికక్కడ ఎండగడ్తున్నారు. ఈ క్రమంలో రామ్మూర్తి వ్యాఖ్యలు ఖమ్మం బీఆర్ఎస్ లో సంచలనం రేపుతున్నాయి.


Next Story