డెడ్‌లైన్ 4 డేస్.. కాంగ్రెస్ MP క్యాండిడేట్స్‌కు వార్నింగ్

by Disha Web Desk 4 |
డెడ్‌లైన్ 4 డేస్.. కాంగ్రెస్ MP క్యాండిడేట్స్‌కు వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నాలుగు రోజుల్లో పనితీరును మార్చుకోవాలి. లేకపోతే టికెట్ మరొకరికి ఇస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్ అభ్యర్థులకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. కొందరు అభ్యర్థులు ఇప్పటికి ప్రచారం మొదలు పెట్టలేదు. క్షేత్ర స్థాయిలో లీడర్లతో సమన్వయం చేసుకునేందుకు రివ్యూలు నిర్వహించలేదు. ఎందుకు టికెట్ ఇచ్చారు? అనే తీరుగా ఇంకొందరు ఉన్నారు.

ఈ విషయాలను గుర్తించిన కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కాంగ్రెస్ అధిష్టానాన్ని అలర్ట్ చేశారు. దీనితో రంగంలోకి దిగిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ అభ్యర్థులు, ఎన్నికల ఇన్‌చార్జులతో కలిపి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనితీరు మార్చుకోవాలని అభ్యర్థులకు సీరియస్‌గా క్లాస్ పీకినట్టు తెలుస్తున్నది.

సీనియర్లే కానీ ఎన్నికల ప్రచారంలో జీరోలు

పనితీరు సరిగాలేదని ఫిర్యాదులు వచ్చిన అభ్యర్థులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. ఒక్కొక్కరికి ఐదారు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. ఇందులో కొందరు మంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రత్యర్థిని ఓడించేందుకు ఏ వ్యూహాలను అమలు చేయాలో కూడా తెలుసు. ఇన్ని తెలిసినా సదరు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడి ఉండటం కాంగ్రెస్ అధిష్టానానికి అందోళన కలిగిస్తున్నది. ‘ప్రభుత్వంలో ఉన్నాం.

ప్రచారంలో దూసుకుపోవాలి. కాని అభ్యర్థులు డల్‌గా ఉండటం జీర్ణించుకోలేని అంశం.’ అని అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఓ మంత్రి కామెంట్ చేశారు. కొందరు అభ్యర్థులు లోకల్‌గా సమన్వయం చేసుకునేందుకు కేడర్, లీడర్లు, ఎమ్మెల్యేలతో మీటింగ్స్ నిర్వహించలేదు. అసంతృప్తిగా ఉన్న లీడర్ల ఇంటికి వెళ్లి సహకారం కోరడం లేదు. కొందరైతే తమకు ఎందుకు టికెట్ ఇచ్చారు? అనే తీరుగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ విషయాలను గ్రహించిన అధిష్టానం సదరు అభ్యర్థులకు పనితీరు మార్చుకోవాలని సూచించినట్టు తెలిసింది.

ఆ నాలుగు స్థానాల్లో పూర్..

సికింద్రాబాద్, మల్కాజిగిరి, జహీరాబాద్, వరంగల్ ఎంపీ నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు అభ్యర్థులు ప్రచారం చేయట్లేదని విమర్శలు వస్తున్నాయి. దానం నాగేందర్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ సమన్వయం కమిటీ సమావేశాలకు వెళ్లలేదని తెలుస్తున్నది. మల్కాజిగిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి నాన్‌లోకల్ కావడం పెద్ద సమస్యగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనితో లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆమెకు సహకరించడం లేదని ప్రచారం జరుగుతున్నది.

జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ ఇంతవరకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ సమన్వయం సమావేశాలు నిర్వహించలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య పార్టీలో చేరిన కడియం శ్రీహరి, కాంగ్రెస్ లీడర్లకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కడియం కుమార్తె కావ్య కోసం పనిచేయలేమని మెజార్టీ లీడర్లు మొండికేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాలను గ్రహించిన శ్రీహరి అసంతృప్తి లీడర్లను బుజ్జగించేందుకు చొరవ చూపడం లేదని విమర్శలు ఉన్నాయి.


Next Story