సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని లేఖ

by Disha Web Desk 2 |
సీఎం కేసీఆర్‌కు సీపీఎం కార్యదర్శి తమ్మినేని లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన హామీ ప్రకారం వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తమ్మినేని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో గత 20 ఏళ్లకు పైగా విద్య, వైద్య రంగాలతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వీరి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు 2016 సంవత్సరంలోనే జీవో నంబర్‌ 16ను ప్రభుత్వం జారీ చేసినప్పటికీ, న్యాయస్థానాల తాత్కాలిక ఉత్తర్వుతో క్రమబద్దీకరణను నిలిపివేశారని పేర్కొన్నారు. 2021డిసెంబర్‌లో సుప్రీంకోర్టు సానుకూలమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

2022 మార్చి 9న రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్దీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. 2023 ఫిబ్రవరి 6న కూడా రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తరపున బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీష్‌రావు ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో 11,108 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను, లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. కానీ వీటికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి నేటికీ జారీ కాలేదన్నారు. కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకుని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్దీకరణకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed