గవర్నర్ తన పని తాను చూసుకుంటే మంచిది: CPI

by Disha Web Desk 2 |
గవర్నర్ తన పని తాను చూసుకుంటే మంచిది: CPI
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పరిధిలో ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. సెప్టెంబర్ 17 విలీనమో, విమోచనమో ఈ సంగతి గవర్నర్‌కు ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ తన పని తాను చూసుకుంటే మంచిదని హితవు పలికారు. శనివారం హైదరాబాద్‌లోని మగ్ధుం భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలకు పనికిరాని గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పేవన్నీ అబద్దాలేనని ముస్లిం పాలకుల నుంచి హిందువులకు విముక్తి లభించిందనడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం రాజు వేరు, ముస్లిం ప్రజలు వేరని పేర్కొన్నారు. సాయుధ పోరాటం చేసింది 90శాతం మంది హిందువులపైనే అని, ప్రజలను విడగొట్టే వారెవరూ దేశ భక్తులు కాలేరని విమర్శించారు. అసలు సెప్టెంబర్ 17తో బీజేపీకి సంబంధమే లేదన్నారు. విమోచనమే కలిగితే అప్పటివరకు ఇబ్బంది పెట్టిన వాళ్లని ఎందుకు జైళ్లో పెట్టలేదని ప్రశ్నించారు. ఆదివారం నుండి సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సెప్టెంబర్ 17న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున విలీన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాల్లో తెలంగాణ సాయుధ పోరాటం అమరవీరులను స్మరిస్తూ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed