కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్.. కంటిన్యూ!

by Disha Web Desk 1 |
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్.. కంటిన్యూ!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ముందుగా పొరపాట్లను సరిదిద్ది, ఆ తరువాతే కానిస్టేబుల్ నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. కొందరు పోలీసు ఉన్నతాధికారులు వీటిని అమలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలీసు శాఖలో 16,604 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది పరీక్షలు నిర్వహించింది. ఇందులో 15,750 అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. ఈనెల 12, 13 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని వెల్లడించింది. అయితే, పరీక్షల్లో నాలుగు ప్రశ్నలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన న్యాయస్థానం ఆ ప్రశ్నలను తొలగించి తిరిగి మార్కుల మూల్యాంకనం చేయాలని సూచించింది. ఆ తర్వాతే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను కంటిన్యూ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

అయితే, ఇటీవల వరంగల్ కమిషనరేట్‌తో పాటు మహబూబ్‌నగర్, మరికొన్ని జిల్లాల్లో పాత షెడ్యూల్ ప్రకారమే ఈ‌నెల 12, 13 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు ప్రకటన జారీ చేశారు. అయితే, దీనిపై హైకోర్టుకు వెళ్లిన అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు ప్రశ్నలను తొలగించి, తిరిగి మూల్యాంకనం చేసిన తరువాతే ఫలితాలు విడుదల చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులను అడిగితే హైకోర్టు ఆదేశాలు తమకు ఇంకా అందలేదని చెబుతున్నారు. అయితే, దీనిపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేస్తామని అభ్యర్థులు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed